ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్…

ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్…
నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు.. ప్రజా ప్రతినిధులు…
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ… కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్ పర్తి 66వ డివిజన్ కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఉన్న మ్యాన్ హోల్ కు పైకప్పు లేకపోవడంతో ప్రమాద భరితంగా నెలకొంది. మూడు రహదారులు కలిసే చోట ఉన్న మ్యాన్ హోల్ తో వాహనదారులు క్షణమొక యుగంగా వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈరహదారి గుండానే కేశవాపూర్, గంటూర్ పల్లి, పెంబర్తి తో పాటు స్థానిక ప్రజలు వెళ్తుంటారు. ఎప్పటికీ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో నెలకొన్న మ్యాన్ హోల్ తో రాత్రి వేళలో బిక్కుబిక్కు మంటూ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళలో ఒకవేళ విద్యుత్ సరఫరా లేనట్లయితే మ్యాన్ హోల్ కనిపించకపోవడంతో..ప్రమాదాలకు నిలయంగా మారింది.పాఠశాల పిల్లలు కూడా ఈరహదారి గుండానే వెళుతుంటారు. ఒకొక్కసారి పిల్లలు ఆడుకుంటూ వెళ్తే అందులో పడిపోయే అవకాశం ఉంది.మ్యాన్ హోల్ మూత లేక నెలలు గడుస్తున్నా.. స్థానిక శానిటరీ,త్రాగునీటి అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈమ్యాన్ హోల్ మూలంగా ఏ క్షణాన..ఏ ప్రమాద సంభవిస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు అధికారులు ప్రజాప్రతినిధులు ఈరహదారి గుండా వెళ్తున్నప్పటికీనీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జరగరాని సంఘటన ఎదైనా జరిగినప్పడు మాత్రమే పట్టించుకుంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలను ప్రమాదాల నుండి కాపాడడానికి స్థానిక కార్పొరేటర్, అధికారులు స్పందించి మ్యాన్ హోల్ కు పై కప్పు అమర్చుతారో.. లేదో వేచి చూడాల్సిందే…
