Mallikarjuna Swamy | వైభవంగా స్వర్ణరథోత్సవం

Mallikarjuna Swamy | వైభవంగా స్వర్ణరథోత్సవం

  • శ్రీశైలంలో శివనామస్మరణ

Mallikarjuna Swamy | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ రోజు ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించిన‌ట్లు కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేసిన‌ట్లు తెలిపారు.అనంతరం స్వర్ణరథోత్సవం నిర్వ‌హించారు.

ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో స‌మృద్ధిగా వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు క‌లిగి ఉండాల‌ని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు నిర్వ‌హించారు.

అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుంచి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా రథోత్సవంలో సంప్రదాయ నృత్యం, ఏర్పాటు చేయబడింది. ఈనాటి స్వర్ణరథోత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, అర్చకస్వాములు, పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply