Malaysia Masters | సెమీఫైనల్‌కు శ్రీకాంత్..

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ 2025 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. తాజాగా నేడు (శుక్రవారం) జ‌రిగిన క్వార్ట‌ర్స్ లో గెలుపోందిన శ్రీకాంత్ సెమీఫైనల్‌కు అడుగుపెట్టాడు.

హోరాహోరీ పోరు..

కౌలాలంపూర్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో.. ఫ్రాన్స్‌కు చెందిన తోమా జూనియర్ పోపోవ్‌పై శ్రీకాంత్ గట్టి పోరాటం చేసి గెలిచాడు. మొదటి గేమ్‌ను 24-22తో గెలిచిన శ్రీకాంత్.., రెండో గేమ్‌ను 17-21 తేడాతో ఓడిపోయాడు. ఈ క్రమంలో చివరి సెట్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అద్భుతంగా పోరాడిన శ్రీకాంత్.. చివరి సెట్ గేమ్‌ను 22-20తో గెలిచి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ హోరాహోరీ పోరు 1 గంట 14 నిమిషాల పాటు సాగింది.

ఇక రేపు (శనివారం) జరిగే సెమీఫైనల్లో శ్రీకాంత్, జపాన్‌కు చెందిన యూషి తనాకాతో తలపడనున్నాడు. తనాకా, గత రౌండ్లలో భారత ప్లేయర్ హెచ్.ఎస్. ప్రణయ్‌ను, అనంతరం ఫ్రెంచ్ ప్లేయ‌ర్ క్రిస్టో పోపోవ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.

మ‌రో సెమీఫైన‌ల్లో…

ఇతర పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ జపాన్‌కు చెందిన కొడాయ్ నరొఒకా, రెండో సీడ్ చైనా ప్లేయర్ లీ షి ఫెంగ్‌తో తలపడనున్నాడు.

మిక్స్‌డ్ జోడికి నిరాశే !

ఇదిలా ఉంటే, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జంట ధ్రువ్ కపిలా – తనిషా క్రాస్టో టోర్నీ నుంచి నిష్క్రమించారు. చైనాకు చెందిన టాప్ సీడెడ్ జంట జియాంగ్ జెన్ బాంగ్ – వే యా జిన్‌లతో జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో వ‌రుస సెట్ల‌లో 22-24, 13-21 ఓడి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం టోర్నీలో ఉన్న ఏకైక భారత క్రీడాకారుడు శ్రీకాంత్ మాత్రమే.

Leave a Reply