Makar Sankranti | బ్రహ్మోత్సవానికి వేళాయే..

Makar Sankranti | బ్రహ్మోత్సవానికి వేళాయే..
- శ్రీశైలంలో 12 నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
Makar Sankranti | శ్రీశైలం, ఆంధ్రప్రభ : మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని కార్య నిర్వాహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడురోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీన ముగియనున్నాయన్నారు. సంప్రదాయాన్నిఅనుసరించి శ్రీ మల్లికార్జునస్వామివారికి ఏటా రెండుసార్లు అనగా మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.

కార్యక్రమాలు ఇలా..
- బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజు 12వ తేదీన ఉదయం 9.15 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తరువాత వేదపండితులు చతుర్వేద పఠనాన్ని చేయడం జరుగుతుంది.
- అనంతరం లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. సంకల్ప పఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ జరిపించబడుతుందన్నారు. గణపతి పూజ తరువాత వృద్ధి, అభ్యుదయాల కోసం స్వస్తి పుణ్యాహవాచనం జరిపించబడుతుంది.
- తరువాత బ్రహ్మోత్సవ నిర్వహణకు అధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేషపూజలు జరిపించబడతాయి. అనంతరం కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండ దీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహించబడతాయి.
- 12వ తేదీ సాయంకాలం 5 గంటల నుంచి అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపనల కార్యక్రమాలు జరిపించబడుతాయి.
- సాయంత్రం 7 గంటల నుండి ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ ఆయా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
- ముక్కోటి దేవతలను, సకల సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకుగాను ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరిపించబడుతుంది.
- బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు, మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం, చండీహోమం, నిత్యహవనాలు జరిపించబడతాయి.
- బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు నుంచి అనగా 13వ తేది నుంచి శ్రీస్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహించబడుతాయి.
- 15వ తేది మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం జరిపించబడుతుంది.
- 17వ తేదీ ఉదయం యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం నిర్వహించబడుతాయి. సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ నిర్వహించబడుతాయి.
- బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన 18వ తేది రాత్రి జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయన్నారు.
- 12న ధ్వజారోహణ
- 13న భృంగివాహనసేవ
- 14న కైలాసవాహనసేవ
- 15న నందివాహనసేవ, బ్రహ్మోత్సవ కల్యాణం
- 16న రావణవాహనసేవ
- 17న పూర్ణాహుతి, త్రిశూలస్నానం, సదస్యం,నాగవల్లి, ధ్వజావరోహణం
- 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలు ఉంటాయి.
ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కల్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవ, గణపతి హోమం ( పరోక్షసేవ) ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవ, ప్రాత: కాల సేవలను నిలుపుదల చేయబడ్డాయన్నారు.
