- మహాగణపతీం
- కరెన్సీపైనా.. వినాయకుడి చిత్రం
- ఇదీ ఇండోనేషియా అభిమానం
(ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ప్రతినిధి) : అదొక అగ్ని విస్పోటన దేశం. ఏకంగా 141 అగ్నిపర్వతాల సమూహం. ఇందులో 130 ప్రమాదభరితం. మహాగణపతే ఈ అగ్నిప్రమాదలకు బ్రేక్ వేస్తున్నాడట. ఇదీ ఓ ముస్లీం దేశ ప్రజల నమ్మకం. ఔనా.. అంటే ఔను. ఇండోనేషియా (Indonesia) పేరు వినగానే.. అగ్నిపర్వతాల లావాల చరిత్ర గుర్తుకు వస్తుంది. ఇదొక ముస్లీం దేశం. కానీ ఇక్కడ అన్ని మతాల ప్రజలూ బొజ్జ గణపయ్యను పూజిస్తారు. ఇందులోనూ మరో విశేషం ఉంది. సాధారణంగా గుడిలో దేవుడు ఉంటాడు. కానీ ఆ దేశంలోని ఓ వినాయకుడికి గుడి లేదు. అయినా ఈ విఘ్నశ్వరుడు నిత్యం పూజలు అందుకుంటాడు. ఇక్కడ పూజలు ఎప్పుడూ ఆగిపోవు. ఇంతకీ ఈ ఘన గణపతి ఎక్కడున్నాడో తెలుసా? ఇండోనేషియాలోని బ్రోమో శిఖరం (Mount Bromo) మీద ఈ వినాయకుడు బహిరంగ ప్రదేశంలోనే ఉన్నాడు.
అక్కడే ఇలా గుడి లేకున్నా ఆయనను నిత్యం పూజిస్తూ భక్త జనం పరవశించిపోతుంది. బ్రోమో అంటే ఇండేనేషియా భాషలో బ్రహ్మ అని అర్థం. అంటే ఈ బ్రోమో శిఖరమే బ్రహ్మ పర్వతం అన్నమాట. ఈ వినాయకుడు (Ganesha) వెలసిన ప్రాంతం అగ్ని పర్వతాల మధ్య ఉంటుంది. ఈ పర్వతాల నుంచి వెలువడే దట్టమైన పొగ ఈ ప్రాంతమంతా కమ్మేస్తుంది. ఇక్కడి పర్వతాలు బద్దలు కాకుండా వినాయకుడే అడ్డుకుని తమని కాపాడుతున్నాడని ఈ ప్రాంతంలోని ప్రజల నమ్మకం.
ఈ అగ్నిపర్వతాలు అప్పుడప్పుడు చిన్న చిన్నగా బద్దలవుతున్నా.. పొగ భయపెడుతున్నా.. పూజలు ఆగవు. ఇండోనేషియాలోని హిందువుల ఆరాధ్య దైవం వినాయకుడే. ఆదేశంలో జరిగిన తవ్వకాల్లో చాలా చోట్ల వినాయక విగ్రహాలు బయటపడ్డాయి. ఇస్లామిక్ (Islamic) దేశమైనప్పటికీ ఇండోనేషియాలో గణేశుడికే అత్యధిక భక్తులు ఉన్నారు.
మరో విశేషమేంటంటే.. ఇండోనేషియా కరెన్సీ నోటుపై వినాయక విగ్రహం చిత్రం కనిపిస్తుంది. సుమారు 700 ఏళ్ల కిందట మౌంట్ బ్రోమో మీద తెంగెర్ మాసిఫ్ ( Tengger massif) అనే తెగ గిరిజనలు ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారట. అగ్ని పర్వాతాల ప్రమాదాల నుంచి ఈ వినాయకుడు తమని కాపాడుతున్నాడని ఇండోనేషియా ప్రజలు ఇప్పటికీ విశ్వస్తున్నారు.
బ్రోమో పర్వతం తూర్పు జావాలోని బ్రోమ తెంగెర్ సెమేరు(Bromo Tengger Semeru) నేషనల్ పార్క్ లో ఉంటుంది. తూర్పు జావాలోనే ఏకంగా 127 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలోనే బ్రహ్మ పర్వతం కూడా ఉంది. అంటే తూర్పు జావా పూర్తిగా డేంజర్ జోన్ లో ఉంది. అందుకే తామందరం ప్రమాదం అంచుల్లో ఉన్నామని, అయినా తాము బతుకుతున్నామని, ఇందుకు వినాయకుడే కారణం అని తూర్పు జావా ప్రజల విశ్వాసం. అందుకే సర్వ విఘ్నోప శాంతయే.. అగజా అని విఘ్నేశ్వరుడిని అక్కడి జనం నిత్యం పూజిస్తున్నారు.