Machilipatnam | నైతిక విలువలతోనే యువత కు బంగారు భవిష్యత్….

Machilipatnam | నైతిక విలువలతోనే యువత కు బంగారు భవిష్యత్….

  • శాయన సంధ్య సన్మాన సభలో వక్తలు…

Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : నైతిక విలువలతోనే యువతకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని పలువురు వక్తలు ఉద్ఘాటించారు.శాయన వీరభద్రయ్య- వీర రాఘవమ్మ సేవా సమితి అధినేత రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శాయన సుశీల రావు కుమార్తె శాయన సంధ్య( అమెరికా డెలాస్) సన్మాన కార్యక్రమం మంగళవారం ఉదయం మచిలీపట్నంలోని ఆర్కే కళాశాలలో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్కే కళాశాల అధినేత డీసీఎంఎస్ చైర్మన్ జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ ఇతరులకు సాయం చేస్తే కలిగే సంతృప్తిని మించినది జీవితంలో మరేదీ లేదన్నారు. ఇతరులకు సాయం చేయాలనే తత్వం మనిషికి వున్న గుణాలలో అన్నిటికంటే గొప్ప గుణమన్నారు విద్యార్థులు చదువుతోపాటు సాయం చేసే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు .

ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినా తండ్రి ఆశయాలకు అనుగుణంగా పేద విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన శాయన సంధ్య మహిళా సమాజానికి ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి నైతిక విలువలను అలవర్చుకోవాలన్నారు. మంచి పనులు పట్ల శ్రద్ధ వహిస్తూ చెడును విస్మరిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. చిన్నతనం నుంచి క్రమశిక్షణతో పెరిగి అమెరికాలో ఉన్నత శిఖరంలో ఉన్న శాయన సంధ్య నేటి బాలికలకు ఆదర్శం కావాలన్నారు. ప్రతిభ గల పేద విద్యార్థులకు సాయం చేస్తున్న సాయన సుశీలరావు ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమార్తె సంధ్య సహకరించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు.

Machilipatnam

గత కొన్నేళ్ళుగా ప్రతినెలా ఇరువురు ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రోత్సహక నగదు బహుమతులు అందిస్తున్న సుశీలరావుకు తన వంతుగా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న సంధ్య గొప్ప గుణవంతురాలు అన్నారు .ఆమె చేతుల మీద ఈరోజు మచిలీపట్నం ఆర్కే కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి పి వెంకట రమణకు అలాగే విజయనగరంలో బీటెక్ చదువుతున్న మచిలీపట్నంకు చెందిన విద్యార్థిని ఆరేపి వాసవికి తలో అయిదు వేల రూపాయలు చొప్పున నగదు బహుమతులు అందించడం హర్షణీయమన్నారు. సన్మాన గ్రహీత శాయన సంధ్య మాట్లాడుతూ అన్నిటికంటే చదువు మనిషికి మంచి పవర్ లాంటిదన్నారు. చదువు అనే పవర్ వుంటే అది మనిషి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మంచి చదువు జీవితంలో రాణించడానికి అనుకున్నది సాధించడానికి దోహాదపడుతుందన్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా చదువు అనే బ్యాగ్రౌండ్ ఉంటే వారి ఎదుగుదలను ఎవరు ఆపలేరన్నారు.

విద్యార్థుల దగ్గర ఎడ్యుకేషన్ అనే పవర్ ఉంటే వారికి మరే బ్యాగ్రౌండ్ అవసరం లేదన్నారు. ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఒకటే మనిషి సక్రమంగా ఎదగడానికి దోహాదపడుతుందన్నారు.అందుకనుగుణంగా విద్యార్థులు తమవ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. మంచి పుస్తకాలు చదవడం మంచి భావాలను అలవరచుకోవడం ద్వారా అది సాధ్యపడుతుందన్నారు. మీరంతా బాగా చదవాలని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా సంధ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాయన సుశీల రావు,సచాయ్ హోటల్ అధినేత బండి సత్యనారాయణ, ఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ శివరామకృష్ణ, సీనియర్ జర్నలిస్టు కె వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply