Lottery | ఆ.. నలుగురు అరెస్ట్..

Lottery | ఆ.. నలుగురు అరెస్ట్..
Lottery, చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలో (Chittoor) అక్రమ లాటరీ విక్రయాలను అణచివేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఈ చర్యల్లో భాగంగా చిత్తూరు సబ్ డివిజన్ ఉపాధికారి వారి పర్యవేక్షణలో చిత్తూరు 1 టౌన్ పోలీసు ఇన్స్పెక్టర్ మహేశ్వర బృందం తనిఖీలు నిర్వహించింది. పట్టణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో లాటరీ విక్రయాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో లాటరీలు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.17,200 నగదు, భారీ సంఖ్యలో లాటరీ టిక్కెట్లను స్వాధీనం చేసుకుని, నిందితుల పై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. అరెస్టయిన నిందితులు భాగ్యరాజ్, రామచంద్ర, మూర్తి, సుబ్రహ్మణ్యం.. వీరందరూ చిత్తూరు పరిసర గ్రామాలకు చెందినవారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారి పై కఠిన చర్యలు తప్పవని, పట్టణంలో శాంతి భద్రత కోసం ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర హెచ్చరించారు.
