న్యూ ఢిల్లీ – మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చకొనసాగుతున్నది.. ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది.. ఆ పార్టీ సభ్యుడు ఎంపీ కృష్ణ ప్రసాద్ టెన్నేటి ఈ బిల్లుపై తమ స్టాండ్ గురించి ప్రస్తావించారు. వక్ఫ్ కు రూ.1.2 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అన్నారు. ఈ ఆస్తులు దుర్వినియోగానికి గురయ్యాయని తెలిపారు.
ఈ ఆస్తిని ముస్లింల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం ఉపయోగించాలని తమ పార్టీ కోరుతోందన్నారు. దీనిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. జేపీసీని డిమాండ్ చేసిన మొదటి పార్టీ తమదే అని లోక్ సభలో స్పష్టం చేశారు. 97 లక్షలకు పైగా కమ్యూనికేషన్లు జరిగాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ బిల్లు 14 సవరణలతో వచ్చిందని.. తమ పార్టీ మూడు సూచనలు ఇచ్చిందన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడే మూడు సూచనలను ఆమోదించారన్నారు. తెలుగుదేశం పార్టీ ముస్లింల సంక్షేమం, అభ్యున్నతికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు కూర్పును నిర్ణయించడానికి, నియమాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఇవ్వాలని తాము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తాము వక్ఫ్ సవరణ బిల్లును మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.