ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో,/ బాసర, ఆంధ్రప్రభ : తెలంగాణలోని తాగునీటి అవసరాల కోసం మహారాష్ట్ర గోదావరిపై నిర్మించిన బాబ్లీ గేట్లను శనివారం ఓపెన్ చేశారు. కేంద్ర జలవనరుల సంఘం ఇరిగేషన్ టీం సమక్షంలో 0.6 టీఎంసీల నీటిని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వదిలిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ నదీ పరివాహక ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని వదిలిపెట్టినట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తివేయగా.. ఈరోజు రాత్రి వరకు బాసర తీరానికి ఆ జలాలు చేరుకుంటాయని అధికారులు అంచనా వేశారు.
ఆనవాయితీగా వస్తున్న ఒప్పందం..
కేంద్రజలవనరుల సంఘంతో మహారాష్ట్ర తెలంగాణ మధ్య గతంలో కుదిరిన ఒప్పందం మేరకు వేసవిలో తాగునీటి అవసరాల నిమిత్తం గోదావరి నీటిని వదలడం ఆనవాయితీగా వస్తుంది. 0.6 టిఎంసి తాగు నీటి కోటా అనంతరం గేట్లు మూసివేస్తారు. తిరిగి జులై 1వ తేదీన మళ్లీ గేట్లు ఎత్తివేసి120 రోజుల పాటు గోదావరి జిల్లాలో దిగువకు వదులుతారు. తిరిగి అక్టోబరు 29న మూసివేస్తారు. కాగా శనివారం బాబ్లీ వద్ద 14 గేట్లు ఎత్తివేయగా నిర్మల్ జిల్లా బాసర మీదుగా గోదావరి నీరు రాష్ట్రంలోకి ప్రవేశించి దిగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తుంది. తెలంగాణ తీర పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని బాసర తాహసిల్దార్ పవన్ చంద్ర పేర్కొన్నారు. అధికారులు సైతం బాసర గోదావరి నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు మేరకే..!
కాగా 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని వదులుతారు.అక్టోబర్29 నుంచి జూన్30 దాకా మూసి ఉంచుతారు.మధ్యలో మార్చి 1న మాత్రం తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలను కిందకు వదులుతారు. ఇరు రాష్ట్రాల ఒప్పందం మేరకు కేంద్ర జల సంఘం అధికారులు నీటి విడుదలపై పర్యవేక్షిస్తారు. ఎస్సారెస్పీ తరఫున ఈఈ చక్రపాణి పాల్గొన్నారు.