ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు
MLA | బాపట్ల టౌన్ , ఆంధ్రప్రభ : స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర 11వ శనివారం నేపథ్యంలో వ్యక్తిగత సమాజ పరిశుభ్రత థీమ్ అంశంతో బాపట్ల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు, డీఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ సలీమా, పురపాలక సంఘం కమిషనర్ జి.రఘునాథరెడ్డి, శానిటేషన్ కార్మికులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులు అందరూ కలిసి శుభ్రం చేశారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలను నాటి నీరు పోశారు.

ఈ క్రమంలో ఖాళీ స్థలంలో ఉంచిన కార్యాలయ వాహనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. వాహనాన్ని వేలంపాట ద్వారా విక్రయించి తద్వారా వచ్చిన డబ్బులను కార్యాలయ అవసరాలకు వినియోగించుకోవాలని ఎమ్మార్వోకు సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కమిషనర్ రఘునాథరెడ్డి సభలో పాల్గొన్న అధికారులు సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. కార్యాలయాల పరిసరాల పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిషనర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం బాపట్లలో 11వ శనివారం అధికారుల నేతృత్వంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. కొబ్బరి, మామిడి, నీడనిచ్చే మొక్కలను నాటడం జరిగిందని తెలియజేశారు. ఒక్క రోజుతో ముగిసిపోయే కార్యక్రమం కాదని నియోజకవర్గంలోని వాడవాడలా ప్రతి వీధిలో పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులందరూ కృషి చేయాలని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ( AP CM Nara Chandrababu Naidu) లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అధికారులు చేస్తున్న కృషి హర్షించదగిన విషయమని ఎమ్మెల్యే తెలిపారు.
సమర్థవంతమైన కలెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలో అధికారులు సమిష్టి కృషితో బాపట్లను బ్యూటిఫుల్ బాపట్లగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టామన్నారు. పర్యాటక అభివృద్ధికి సూర్యలంక సముద్రతీరం వద్ద స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేశామన్నారు. మున్సిపల్ కార్యాలయం, వివిధ గ్రామాలలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెల ఒక్కొక్క అంశంతో ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు శుభ్రత పట్ల అవగాహన కల్పించడం అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మన వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత భారతదేశమంతటా చేయడం ద్వారా స్వచ్ఛభారత్ కు అడుగులు వేస్తున్నామన్నారు. ప్రపంచ దేశాలలో స్వచ్ఛభారత్ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తుందన్నారు. అన్ని వనరులు సమృద్ధిగా ఉన్న భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రజలకు మేలు కలిగి చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ బాపట్లకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

