విధులను వదిలి.. వివాహానికి..!
- తహసీల్దార్ కార్యాలయం ఖాళీ..
మేడిపల్లి, ఆంధ్రప్రభ : ఓవైపు రాష్ట్రంలో మొంథా తుఫాన్(Montha Tufan) ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులు(superiors) ఆదేశించినప్పటికి కొందరు మండల స్థాయి అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడినట్లు కనిపించడం లేదు. మండల స్థాయిలో సేవలందించే కార్యాలయాన్ని వదిలి, ఓ వివాహానికి హాజరు కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే అధికారి స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మధ్యాహ్నం ఒక్కరూ అందుబాటులో లేకుండా పోయారు. కార్యాలయం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. అయితే ఇందుకు కారణం ఏమై ఉంటుందా? ఆరా తీస్తే వీరంతా కలిసి కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి ఇంట్లో జరిగే వివాహానికి వెళ్లినట్లు తెలిసింది. వెళితే వెళ్లారు. సరే..
కానీ మండలంలో ప్రధాన శాఖ(main department) అయిన, భూములకు సంబంధించి ఎంతో ముఖ్యమైన రికార్డులు, ఫైళ్లను భద్రంగా చూసుకోవాల్సిన రెవెన్యూ విభాగంలో పని చేస్తూ.. ఇలా కార్యాలయాన్ని తెరిచే ఉంచి కట్ట కట్టుకొని పోవడం విమర్శలకు తావిస్తోంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు కార్యాలయ వేళల్లో ఇలా వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కాగా, ఈ విషయమై కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి(Jeevakar Reddy)ని వివరణ కోరగా, కేవలం 45 నిమిషాలు మాత్రమే భోజన విరామ సమయం తీసుకోవచ్చని తెలిపారు. కానీ ఇలా పెళ్లికి వెళ్లిన విషయంపై కార్యాలయంలో తగిన విచారణ జరుపుతామని ఆర్డిఓ(RDO) స్పష్టం చేశారు.


