టెక్ రంగాన్ని మరోసారి మాస్ లేఆఫ్స్ ఊచకోత కుదిపేస్తోంది. 2025 మొదటి అర్ధభాగంలోనే ప్రముఖ టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లు, కరోనా తర్వాత ఏర్పడిన వ్యయభారం, కృత్రిమ మేధస్సు (AI) దూసుకెళ్తున్న వేగం… ఇవన్నీ కలిసి ఉద్యోగ కోతలకు ప్రధాన కారణాలుగా మారాయి.
మైక్రోసాఫ్ట్ – మూడోసారి ఊచకోత
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే రెండు విడతల లేఆఫ్స్ చేపట్టిన తర్వాత, ఇప్పుడు జూలై నాటికి మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈసారి ప్రధానంగా సేల్స్ విభాగంలో పనిచేస్తున్న వారే లక్ష్యంగా ఉన్నారు. AI టూల్స్‌పై పెట్టుబడులు పెంచుతూ, వ్యాపార వ్యూహాలను తిరిగి సిద్ధం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంటెల్ – చరిత్రలోనే అతిపెద్ద కోత
చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ తన ‘ఇంటెల్ ఫౌండ్రీ’ విభాగంలో 15–20 శాతం ఉద్యోగులను తొలగించనుంది. అంటే దాదాపు 10,000 మందికి పైగా లేఆఫ్స్ చేపట్టింది.
క్రౌడ్‌స్ట్రైక్ – 500 మందికి ఎత్తిపోతలు
సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్‌స్ట్రైక్ 5 శాతం ఉద్యోగులను (దాదాపు 500 మంది) తొలగిస్తోంది. AI టూల్స్ ఉపయోగించి పనితీరు మెరుగుపరచడం, వ్యయాలను తగ్గించడమే ఈ చర్య వెనక ఉన్న ఉద్దేశం.
అమెజాన్ – డివైసెస్ విభాగంలో కోత
అమెజాన్ ఇప్పటికే అలెక్సా, కిండిల్, జూక్స్ వంటి డివైసెస్ అండ్ సర్వీసెస్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. CEO ఆండీ జాసీ స్పష్టం చేశారు – “AI సాంకేతికత కారణంగా కొన్ని ఉద్యోగాలు పోతున్నా, కొత్త అవకాశాలు కూడా తలెత్తుతున్నాయి.”
బ్లాక్ – జాక్ డోర్సీ కంపెనీలో సంచలనం
జాక్ డోర్సీ నేతృత్వంలోని బ్లాక్ (Block) సంస్థ దాదాపు 1,000 మందిని తొలగిస్తోంది. 200 మంది మేనేజర్‌లను సాధారణ ఉద్యోగులుగా మార్చి, 800 ఖాళీ పోస్టులను పూర్తిగా రద్దు చేసింది. వ్యాపారాన్ని నిష్పత్తిలో నడిపించాలన్న ఉద్దేశమే దీని వెనక ఉంది.
మెటా – పనితీరు ఆధారంగా నిర్ణయం
మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ తక్కువ పనితీరు ఉన్న ఉద్యోగులపై లక్ష్యాన్ని పెడుతున్నారు. దాదాపు 3,600 మందిని తొలగించనున్నారు. ఫేస్‌బుక్, హారిజన్ వీఆర్, రియాలిటీ ల్యాబ్స్ విభాగాల్లో ఈ కోతలు ప్రధానంగా పడుతున్నాయి.
వాల్‌మార్ట్ – టెక్ టీమ్ ప్రభావితమైనా
గ్లోబల్ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కూడా గ్లోబల్ టెక్నాలజీ, ఈ-కామర్స్, ఆపరేషన్స్, వాల్‌మార్ట్ కనెక్ట్ వంటి విభాగాల్లో 1,500 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ ప్రస్తుతం వ్యయ నియంత్రణ, వ్యాపార సర్దుబాట్లపై దృష్టి పెడుతోంది.