❇ ముగిసిన బన్సోద్, సాత్విక్ జోడీ పోరాటం
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా.. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ ఓటమిపాలైంది. భారత అగ్రశ్రేణి పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.
ఈరోజు (గురువారం) జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి-క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-13, 21-10 తేడాతో ఇండోనేషియా స్టార్ షట్లర్ మూడో సీడ్ జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించాడు. ఆదినుంచే చెలరేగి ఆడిన లక్ష్యసేన్ కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు.
మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్ మాళవిక బన్సోద్ 16-21, 13-21 తేడాతో మూడో సీడ్ అకానె యమగుచి (జపాన్) చేతిలో వరుస గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ పోటీలో భారత్ పోరాటం ముగిసింది.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో 7వ సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాట్ శెట్టి జోడీ ప్రి క్వార్టర్‌లో 16-21, 2-2 తేడాతో చైనా జంటపై వెనుకంజలో ఉన్న సమయంలో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగారు.