protest | లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

- నిరసనలో సీఐటీయూ- ఏఐటీయూసీ డిమాండ్
protest|చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నాలుగు లేబర్కోడ్ లు అమలు కోసం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడం శ్రామికవర్గంపై దాడిని దీన్ని రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఒత్తిడి చేయడం అప్రజాస్వామికమని.. వాటి హక్కు యజమానులకు పూర్తి అనుకూలంగా లేబర్కోడ్లు తెచ్చిన వాటిని వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్త నిరసనలో భాగంగా బుధవారం గిరింపేటలో సీఐటీయూ -ఏఐటీయూసీ – సీపీఐ- సీపీఎంల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ వలన కార్మికులు నష్టపోతారని, దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని కార్మికులు ఉద్యోగులు ప్రజలకి పిలుపునిచ్చారు.
ఈ కోడ్లు కార్మికవర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని చెప్పారు. వీటిల్లో కనీస వేతనం నిర్వచనాన్ని అస్పష్టంగా పేర్కొన్నారని అన్నారు. కార్మిక యూనియన్లకు సమ్మె చేసే హక్కును, వేతనాల కోసం యజమాన్యంతో చర్చించే హక్కునూ లేకుండా చేశారని విమర్శించారు. కార్మికశాఖను పనికిరాని సంస్థగా మార్చేశారని, అధికారులను ఫెసిలిటేటర్లుగా పేర్కొన్నారని తెలిపారు. గిగ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించలేదని పేర్కొన్నారు. కార్మికరంగం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, దాన్ని కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుంటోందని విమర్శించారు. కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ఇటువంటి అప్రజాస్వామిక చట్టాలు అమలు చేయాలని ఒత్తిడి చేస్తోందని, వీటిని అంగీకరించే ప్రసక్తే లేదని తెలిపారు. కార్మికవర్గంపై దాడి చేయడం అంటే మొత్తం ప్రజలపై దాడి చేయడమేనని తెలిపారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా వారిపై దాడి చేసిన ప్రభుత్వాలు ఏవీ కూడా మనుగడ సాధించలేదని హెచ్చరించారు. ఈ లేబర్ కోడ్స్ వలన అన్ని రకాల కార్మికులు ఉద్యోగులకు ప్రజలకి ప్రమాదం అని తెలిపారు. వాటిని రద్దు చేసే వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే చిత్తూరులో విద్యుత్ డిస్ట్రిక్ట్ స్టోర్ హమాలీల కడుపు కొట్టే విధంగా చిత్తూరు అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ కాంట్రాక్టర్లు ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. దాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దాస్ ఆనంద్ శివ, ఏఐటీయూసీ నాయకుడు గోపి, విజయ్ కుమార్, విజయ గౌరీ బాలాజీలతో పాటు కార్మికులు పాల్గొన్నారు.
