Kyc| ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు2026 ప్రారంభం

Kyc| ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు2026 ప్రారంభం

KYC – సురక్షిత బ్యాంకింగ్ వైపు తొలి అడుగు- కర్నూలులో
పోస్టర్లు, టీవీ కమర్షియల్స్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 13 వరకు కార్యక్రమాలు
సైబర్ మోసాలు, మనీ మ్యూలింగ్ నివారణపై ప్రత్యేక దృష్టి
KYC, Re-KYC, C-KYC ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం

Kyc|కర్నూల్, ఆంధ్రప్రభ: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్ (FLW)–2026 అనగా “ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు” కార్యక్రమాలు ఫిబ్రవరి 13 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల ప్రధాన థీమ్ *“KYC – సురక్షిత బ్యాంకింగ్ వైపు తొలి అడుగు / KYC – Your First Step to Safe Banking” గా నిర్ణయించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, కలెక్టరేట్లో FLW–2026 పోస్టర్లు ,టీవీ కమర్షియల్స్ ను అధికారికంగా ఆవిష్కరించి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమాల్, జిల్లా పరిషత్ సీఈవో నసరా రెడ్డి, పీడీ డీఆర్డీఏ రమణ రెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM) రామచంద్రరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

KYC (నో యువర్ కస్టమర్) అనేది సురక్షిత బ్యాంకింగ్కు పునాది అని, ఖాతాదారుల భద్రత, మోసాల నివారణ, అక్రమ లావాదేవీల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న KYC సంబంధిత మోసాలు, సైబర్ నేరాలు, మనీ మ్యూలింగ్ వంటి అక్రమ కార్యకలాపాల నేపథ్యంలో ఈ థీమ్ అత్యంత అవసరముఅని పేర్కొన్నారు.

KYC ప్రక్రియ ద్వారా బ్యాంకులు ఖాతాదారుల గుర్తింపు, చిరునామాను అధికారిక పత్రాల ద్వారా నిర్ధారిస్తాయి. ఇది నకిలీ ఖాతాలు, డబ్బు దుర్వినియోగం, అక్రమ లావాదేవీలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని లీడ్ బ్యాంకు మేనేజర్ రామ చంద్ర రావు అన్నారు. KYC అప్డేట్ చేయకపోతే ఖాతాలపై పరిమితులు విధించే అవకాశం ఉందని, అందువల్ల ఖాతాదారులు తమ KYC వివరాలను సకాలంలో నవీకరించుకోవాలని అధికారులు సూచించారు.

Re-KYC (రీ–KYC) ప్రాముఖ్యత :

ఈ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు లో భాగంగా Re-KYC (పునః KYC) యొక్క అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించబడుతుంది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు కాలక్రమేణా మారే అవకాశం ఉండటంతో, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం బ్యాంకులు కాలానుగుణంగా KYC నవీకరణ చేయాల్సి ఉంటుంది. KYCను సకాలంలో నవీకరించకపోతే బ్యాంకు ఖాతాలపై పరిమితులు విధించబడే అవకాశం ఉందని తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం:

తక్కువ ప్రమాద ఖాతాలు – ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి
మధ్యస్థ ప్రమాద ఖాతాలు – ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి
అధిక ప్రమాద ఖాతాలు – ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి Re-KYC చేయాల్సి ఉంటుంది. ఖాతాదారులు బ్యాంకు శాఖలు, బిజినెస్ కారస్పాండెంట్లు (BCలు) లేదా అందుబాటులో ఉన్న డిజిటల్ విధానాల ద్వారా తమ Re-KYC ను సులభంగా పూర్తిచేయవచ్చని వివరించారు.

అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలు (OVDs) :

Re-KYC కోసం ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన NREGA జాబ్ కార్డు, నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (NPR) ద్వారా జారీ చేసిన లేఖ వంటి పత్రాలను ఉపయోగించవచ్చని తెలిపారు.

CKYC – ఒకసారి KYC, అన్ని బ్యాంకులకు:

ఈ సందర్భంగా సెంట్రల్ KYC రిజిస్ట్రీ (CKYC) ప్రయోజనాలపై కూడా అవగాహన కల్పిస్తారు. ఒకసారి CKYC పూర్తయితే, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో ఖాతాలు తెరవడానికి మళ్లీ మళ్లీ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఖాతాదారులకు ఇచ్చే 14 అంకెల CKYC నంబర్ను సురక్షితంగా వినియోగించుకోవాలని సూచించారు.

విద్యార్థులకు క్విజ్ & సైబర్ అవగాహన:

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు(FLW)–2026 లో భాగంగా, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో రవీంద్ర డిగ్రీ కాలేజీలో విద్యార్థుల కోసం KYC, e-KYC , CKYC పై క్విజ్ & అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఖాతా నిర్వహణ క్రమశిక్షణ, డిజిటల్ బ్యాంకింగ్ జాగ్రత్తలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించబడింది. క్విజ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి, రెండు స్థానాల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల అవగాహన నిపుణుడు అమర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో జరుగుతున్న మోసాలు, ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింకులు, OTP దుర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు విపులంగా వివరించారు.

బిజినెస్ కారస్పాండెంట్లకు ప్రత్యేక అవగాహన శిబిరం :

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు(FLW)–2026 లో భాగంగా కర్నూలులో బిజినెస్ కారస్పాండెంట్లకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో KYC / Re-KYC విధానాలు, అవసరమైన OVDలు, CKYC ప్రక్రియలు, KYC అప్డేషన్కు సంబంధించిన బ్యాంకుల ప్రోత్సాహకాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. గ్రామీణ స్థాయిలో Re-KYCను సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో BCలు కీలక పాత్ర పోషిస్తారని లీడ్ బ్యాంకు మేనేజర్ రామ చంద్ర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ & CB R-SETI డైరెక్టర్ పుష్పకుమార్ FLC కౌన్సిలర్ రామలక్ష్మయ్య, పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా FLW-2026 కార్యక్రమాలు:

జిల్లాలోని అన్ని బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విస్తృతంగా నిర్వహిస్తారని LDM అన్నారు. ప్రతి శాఖలో FLW పోస్టర్లను ప్రదర్శించడంతో పాటు కనీసం రెండు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, కొనసాగుతున్న FLW-2026 క్యాంపెయిన్లో Re-KYC , KYC మెరుగుపరచాలని సూచించారు. అలాగే ఈ కార్యక్రమాల పురోగతిని DCC/DLRC , JMLBC సమావేశాల్లో సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా FLW–2026 (ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు) ద్వారా జిల్లావ్యాప్తంగా ప్రజల్లో సురక్షిత బ్యాంకింగ్, KYC, Re-KYC, CKYC సైబర్ మోసాల నివారణపై విస్తృత అవగాహన కల్పించబడుతోందని లీడ్ బ్యాంకు మేనేజర్ రామ చంద్ర రావు తెలిపారు.

Leave a Reply