హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌గా కర్నూలు జట్టు

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని పోటీల నిర్వాహక కార్యదర్శి డాక్టర్ రుద్ర రెడ్డి వెల్లడించారు.

ఫైనల్స్‌లో కర్నూలు జట్టు వైజాగ్ జిల్లా జట్టును 19-16 గోల్స్ తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. రెండో స్థానాన్ని వైజాగ్ సాధించగా, మూడో స్థానంలో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జట్లు సంయుక్తంగా నిలిచాయి.

శనివారం స్టేడియంలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా క్రీడల ఇన్‌చార్జి అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయకుమార్, ఒలింపిక్ కార్యనిర్వహణ కార్యదర్శి సునిల్‌కుమార్, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు వెంకటేష్, సీనియర్ క్రీడాకారుడు ఫణీంద్ర పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ నెల 15 నుంచి 20 వరకు కోల్కత్తాలో జరగబోయే 54వ జాతీయ స్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు పాల్గొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు ప్రభాకర్, రావూఫ్, దుర్గాప్రసాద్, పోటీల పరిశీలకులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply