కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..
అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్
ఎంపీ కేశినేని శివనాద్ కృషితో నెరవేరిన నందిగామ వాసుల చిరకాల వాంఛ
2026 -27 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతి
విజయవాడ, ఆంధ్రప్రభ : నందిగామ ప్రాంత వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య సహకారంతో విశేష కృషి చేశారు.
నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సైతం ఎంపీ విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు నియోజకవర్గంలోని పల్లగిరి ప్రాంతంలో 5 ఎకరాల మేర స్థల గుర్తింపు ఆ స్థలాన్ని కేంద్రియ విద్యాలయ సంఘటన్ కు చర్యలు చేపట్టారు. ఇటీవల సైతం స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, రెవిన్యూ ఉన్నతాధికారులతో కలిసి స్థల పరిశీలనను ఎంపీ కేశినేని శివనాద్ చేశారు. ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ కేంద్రీయ విద్యాలయ సంగటన్ నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదముద్ర వేయగా వాటిలో నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఒకటిగా ఉంది. 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి నందిగామ కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తాత్కాలికంగా నందిగామలోని మహిళా పాలిటెక్నిక్ ట్రైనింగ్ సెంటర్ నందు కేంద్రీయ విద్యాలయం నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
ఈ విద్యాలయం ద్వారా 2026-27 విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతాయని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అడిషనల్ కమిషనర్ (అడ్మిన్ ) దీపేష్ గెహ్లాట్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాత్కాలిక వసతి, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థల కేటాయింపులు తదితర ఏర్పాట్లు జరిగిన వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ కు ఎంపీ కేశినేని చిన్ని ధన్యవాదాలు తెలిపారు.
