అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలి

అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ : అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదన్నారు.
వచ్చిన ప్రతి ఒక్క అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అధికారుల లాగిన్ లలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని పెండింగ్ లో ఉంచకూడదన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా కాలపరమితికి వెళ్లకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు రీ ఓపెన్ కాకూడదన్నారు.. అదే విధంగా ఎట్ టు వ్యూ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను చూడాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పిడి చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
