బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

బాల్య వివాహ విముక్త రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి

కర్నూలు, ఆంధ్ర‌ప్ర‌భ : బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో బాల్య వివాహ ముక్త భారత్ – 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహ విముక్త రథాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం “బాల్య వివాహ ముక్త భారత్” పేరుతో 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలన పై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు బాల్య వివాహా విముక్త రథంను ప్రారంభించడం జరిగిందన్నారు.

100 రోజుల క్యాంపెయిన్‌లో భాగంగా, నేటి నుండి 8 వ తేది వరకు ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో తిరుగుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు. ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేయవద్దని, చదువు చెప్పించి వారిని ప్రయోజకులను చేయాలని కలెక్టర్ కోరారు. ఐసిడిఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహ విముక్త రథం గ్రామాల్లో, మండలాల్లో తిరుగుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల పై ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం నింపుతుందన్నారు. కేవలం మాటల ద్వారానే కాకుండా, ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా జానపద నృత్యాలు, డ్రామాలు, స్కిట్స్, కళాజాతా కార్యక్రమాల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించి, సమాజంలో మార్పు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దీనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ, సిడిపివో లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply