Kurnool | ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం…

Kurnool | ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం…
- రైతులకు పాస్ పుస్తకాల పంపిణీకి సీఎం చంద్రబాబు రాక.
- ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నేడు విస్తృత పర్యటన… .
- రైతులతో ముఖాముఖి, పార్టీ క్యాడర్ సమావేశం.
Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగట్ల గ్రామంలో నిర్వహించనున్న ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఉదయం క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి సుమారు ఉదయం 11.30 గంటలకు కలుగట్ల గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ నిర్వహించే గ్రామసభలో అర్హులైన రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేయనున్నారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
రైతులతో ప్రత్యక్ష చర్చ..
గ్రామసభ అనంతరం ముఖ్యమంత్రి సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి భూ రీసర్వే పనుల పురోగతిని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, భూముల హక్కులు, వ్యవసాయ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పరిస్థితులపై నేరుగా చర్చించనున్నారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు తెలిపాయి.

పార్టీ క్యాడర్ సమావేశం…
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా కలుగట్లలో పార్టీ క్యాడర్ సమావేశానికి కూడా హాజరవుతారు. జిల్లాలో పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, రాజకీయ పరిస్థితులపై నాయకులతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు అమరావతికి తిరిగి వెళ్లనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ…
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 279 గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,16,870 డ్రాఫ్ట్ పాస్ పుస్తకాలు సిద్ధంగా ఉండగా, వాటిలో 91,038 పాస్ పుస్తకాలకు eKYC ప్రక్రియ పూర్తయ్యింది.
కర్నూలు జిల్లాలో రైతులకు లబ్ధి…
కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో మొత్తం 8,347 మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. ఇందులో భాగంగా కలుగట్ల గ్రామంలోనే 1,178 మంది రైతులకు శుక్రవారం కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ట్రాఫిక్ మళ్లింపు, సభా ప్రాంగణ ఏర్పాట్లు, హెలిప్యాడ్ నిర్మాణం వంటి ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో రైతుల భూ హక్కుల పరిరక్షణకు మరింత బలమైన పునాది పడుతుందని అధికారులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
