Kurnool | మాత శిశు సంరక్షణకు ప్రాధాన్యం

Kurnool | మాత శిశు సంరక్షణకు ప్రాధాన్యం
- టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి డాక్టర్ రఘు
Kurnool | కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలోని కొత్తపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సచివాలయంలో శుక్రవారం నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, సంచార చికిత్స కార్యక్రమాన్ని నోడల్ అధికారి డాక్టర్ రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ మాతా–శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రమాదకర సమస్యలు ఉన్న గర్భిణీలను ఆరోగ్య కార్యకర్తలు క్రమబద్ధంగా, సకాలంలో తరచూ పర్యవేక్షించాలని సూచించారు.
ముందుగా ఊహించిన కాన్పు తేదీల ప్రకారం గర్భిణీల ఆరోగ్య స్థితిగతులను ప్రతి రోజు క్రమం తప్పకుండా పరిశీలించి, అవసరమైన సలహాలు ఇవ్వాలని తెలిపారు. గర్భిణి వివరాలు నమోదు చేసే సమయంలో మాతా–శిశు సంరక్షణ కార్డును పూర్తి సమాచారంతో నింపాలని, అదే కార్డులో ప్రసవ తేదీ నిర్ణయించబడుతుందని పేర్కొన్నారు.
గర్భం దాల్చిన దశ నుంచి బిడ్డకు 16 సంవత్సరాలు వచ్చే వరకు అవసరమైన అన్ని రకాల టీకాలను జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాల్లో ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీకాల ప్రాముఖ్యతను, వాటిని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాలను తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. చిన్నారులకు టీకాలు సకాలంలో ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యంగా ఎదుగుతారని డాక్టర్ రఘు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఆరోగ్య కార్యకర్తలు భువనేశ్వరమ్మ, కళ్యాణి, ఆశ కార్యకర్తతో పాటు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.
