పెద్దపులిని పట్టేశారు

పెద్దపులిని పట్టేశారు
విశాఖ యానిమల్ రెస్క్యూ సెంటర్ కి తరలింపు
( ఆరిలోవ, విశాఖపట్నం , ఆంధ్రప్రభ ):
గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం పరిసర ప్రాంతాలలో హల్చల్ చేసిన పెద్దపులిని రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు శుక్రవారం మత్తుమందు ఇచ్చి బంధించారు. అనంతరం ప్రత్యేక బోనులో విశాఖ జూపార్క్ సమీపంలోని యానిమల్ రిస్క్యు సెంటర్ కు శనివారం ఉదయం తరలించారు.

ఫారెస్ట్ చీఫ్ సెక్రటరీ దివాన్ మైదిన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం సమీప ప్రాంతంలో స్థానిక ప్రజలకు కంటిమీద కొనుకు లేకుండా చేసిన పెద్దపులిని ప్రత్యేక బృందం పట్టుకున్నారన్నారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు గాను విశాఖ జూ పార్కు సమీపంలోని ఏఆర్సి కి తరలించినట్టు తెలిపారు.

ఈ పెద్దపులి వయసు సుమారు మూడు నుండి మూడున్నర సంవత్సరాలు ఉంటుందని, ప్రస్తుతం పెద్దపులి ఆరోగ్య నిలకడగా ఉందన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాల్సి ఉంటుందన్నారు. అనంతరం అధికారుల ప్రత్యేక కమిటీ ఆదేశాల మేరకు పెద్దపులిని ఎక్కడ ఉంచాలనేది నిర్ధారిస్తామని తెలియజేశారు. ఈ పెద్ద పులి బోనులో అటు ఇటు కలియ తిరుగుతూ, భీకరమైన గాడ్రింపులతో హల్చల్ చేస్తోంది.
