బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దూకిన గోడలు.. సాగర్ సొసైటీలో లీలలు చెప్పమంటే చెబుతాను అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. ఢిల్లీకి పంపే మూటల లెక్కలు సీఏం చెప్తున్నాడని, ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్‌లో పలు విషయాలపై కామెంట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో తమకు తెలువదా?.. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు అని, ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయ 5కే మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారని చెప్పారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా తన దగ్గర ఉన్నాయని, పదేళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరు ఏంటో అన్నీ తెలుసునని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదు అని ప్రశ్నించారు.
70 వేల కోట్లు లోటు అని సీఎం ఒప్పుకున్నారు…
కేటీఆర్ మాట్లాడుతూ రూ.70 వేల కోట్ల లోటు ఉంది అని సీఎం ఒప్పుకున్నారన్నారు. బడ్జెట్ ముందే ఇలా లీక్ చేస్తారా.. సంపద సృష్టించే జ్ఞానం లేదని విమర్శించారు. ఈ సంవత్సరం మొత్తం నెగటివ్ పాలిటిక్స్ చేశారని, ఇప్పుడు కోవిడ్ లాంటిది ఏమైనా ఉందా? సీఎం అప్రూవర్ గా మారి నేర అంగీకారం చేశారని అన్నారు. ఇప్పుడు ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ మీద ఉన్న కోపంతో పంటలు ఎండబెట్టారని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం అవడానికి సీఎం వైఖరే కారణమని మండిపడ్డారు. కేంద్రం సఖ్యతతో సాధిస్తాను అన్నావ్.. ఏమి సాధించావ్ అని ప్రశ్నించారు. 2014 లో ప్రజలు ఆలోచించి కేసీఆర్ ను గెలిపించారు కాబట్టే ఈ పదేళ్లలో పునాదులు గట్టిగా పడింది. ఇంత మంచి పునాది ఉన్నా…ఈ కాంగ్రెస్ ఘోరంగా విఫలమయిందని, ముఖ్యమంత్రి గాసిప్స్ మానేసి గవర్నెన్స్ మీద సోయి పెట్టాలని సూచించారు.తాను చెప్పాలంటే చాలా చెప్తా. ఢిల్లీ లో దూకిన గోడలు, సాగర్ సొసైటీ లీలలు అన్ని తనకు తెలుసునని అన్నారు. అవసరం వచ్చినప్పుడు బయట పెడతాను అంటూ సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు.
రేవంత్ నీతి సూత్రాలపై కేటీఆర్ ఎద్దేవా
తన మీద 15 కేసులు పెట్టిన రేవంత్ రెడ్డికు ప్రజాసామ్య విలువలు ఈ రోజు గుర్తుకు వచ్చాయా…? రేవంత్ కు ఈ రోజు కుటుంబం గుర్తుకు వచ్చిందా? తమపై దారుణమైన, అసహ్యకరమైన అరోపణలు, మాటలు మాట్లాడినప్పుడు తమ కుటుంబాలు, ఫ్యామిలీలు లేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తమకు సంబంధాలు అంటగట్టినప్పుడు, తమ పిల్లల్ని రాజకీయాల్లోకి లాగిన రోజు మీకు విలువలు లేవా?, ఈ రోజు ముఖ్యమంత్రి తన పిల్లలు, భార్య గురించి మాట్లాడుతున్నారు, మరి ఆ రోజు తమ కుటుంబాలు ఉండేవి కదా?, ఇదేనా జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి ఇచ్చే గౌరవం?, నీతో కలిసి వచ్చినప్పుడు నీ మాటలు చెప్పినప్పుడు యూట్యూబర్లంతా జర్నలిస్టులుగా కనిపించారని. ఇవాళ మిమ్మల్ని విమర్శిస్తే జర్నలిస్టులు కారా? అని ప్రశ్నించారు.
ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను యూట్యూబ్‌లో ఎండగడుతుంటే వాళ్లని జర్నలిస్టులు కాదంటున్నారని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులను జర్నలిస్టులు కాదంటూ రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. జర్నలిస్టుల బట్టలు విప్పిస్తా అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఎవరూ మాట్లాడటం లేదని, ఇదేనా జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి ఇచ్చే గౌరవం? విలువలని అసెంబ్లీలో చిలకపలుకులు మాట్లాడి, స్టేషన్ ఘన్‌పూర్‌లో బజారు భాష మాట్లాడాడని అన్నారు. రాజకీయాల్లో హద్దు దాటకూడదని ఇన్నాళ్ళు సంయమనంతో వ్యవహరించామన్నారు. తాము కూడా రేవంత్ లెక్కనే మాట్లాడితే బయటతిరగలేరని అన్నారు. తాము కూడా రేవంత్ రెడ్డి బట్టలు విప్పగలమన్నారు. తాము కూడా సాగర్ సొసైటీ, మైహోం భుజా వ్యవహారాల గురించి మాట్లాడగలమన్నారు.
అందాల పోటీతో ఏం సాధించాలనుకుంటున్నారు?
అందాల పోటీలు పెట్టి రేవంత్ ఏం సాధించాలనుకుంటున్నారు? కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం అప్పలు పాలైందని చెబుతూ అందాల పోటీలు పెడతారా?, మింగ మెతుకు లేదు. మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంది అందాల పోటీ కథ అని అన్నారు. రూ. 46 కోట్లతో ఫార్ములా ఈ రేసు పెట్టి రాష్ట్రానికిి ఏం తెస్తామో చెప్పినా వినకుండా అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇవాళ రూ.250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అని ప్రశ్నించారు. అందాల పోటీలతో ఊరూరికీ బ్యూటీ పార్లర్ పెడతావా? ఇప్పుడు అందాల పోటీలకు అంత ప్రాధాన్యత లేదని అన్నారు. కరెంట్ కోతలు, తీవ్ర వ్యవసాయ సంక్షోభంలో రాష్ట్రం చిక్కుకుంటే, ప్రభుత్వం ఫోకస్ మొత్తం అందాల పోటీల మీద ఉందని అన్నారు.