నంద్యాల బ్యూరో, ఫిబ్రవరి 25 : రాయలసీమ ప్రాంతం ఎడారి కాకుండా ఉండాలి అంటే శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఉన్న కర్నూల్ లో కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని నంద్యాలలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, నంద్యాల సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగ నాయుడు, సీపీఐ పట్టణ కార్యదర్శి కే.ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, భాస్కర్ శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, సంజీవులు బాలకృష్ణ, రైతులు వేలాదిగా పాల్గొని నిరసన ధర్నా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం చేపట్టిన తర్వాత మరొక లాగా వ్యవహరించి ప్లేటు ఫిరాయించడం తగదని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమ ప్రజల జీవనాడి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లాలోని ప్రజలు వేలాది ఎకరాల భూమిని కోల్పోయి సర్వస్వం కోల్పోయిన ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతమైన కర్నూల్ లో కృష్ణా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.
రాయలసీమలో ఉన్న వందల మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేసేందుకు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నంద్యాలలో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది. నంద్యాల జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంత రైతులు వేలాదిగా తరలివచ్చారు. ఈ ర్యాలీని చూసి అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ర్యాలీలో రాయలసీమ ప్రాంత రైతుల నినాదాలు అక్రందన రూపంలో వెలువడ్డాయి.