కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జి. అరుణ హెచ్చరిక..

కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జి. అరుణ హెచ్చరిక..
గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న రూ. 1.64 కోట్ల ఇంటి పన్ను బకాయిలను తక్షణమే వసూలు చేయాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జి. అరుణ సిబ్బందిని ఆదేశించారు. ఆమె గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, పన్నుల వసూలు పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. మండలంలోని మేజర్ పంచాయతీలైన గన్నవరం, కేసరపల్లి, ముస్తాబాద్ గ్రామాల్లో అత్యధికంగా బకాయిలు పేరుకుపోయాయని అసహనం వ్యక్తం చేశారు. మార్చి నెలాఖరు లోపు వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, ఇందుకోసం ఆదివారం కూడా సెలవు లేకుండా సిబ్బంది క్షేత్రస్థాయిలో పన్నులు వసూలు చేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది పై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బకాయిదారులు కూడా సహకరించి పన్నులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎంపీడీవో స్వర్ణలత, డిప్యూటీ ఎంపీడీవో భారతి, గన్నవరం పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
