HYD | పదవులకే వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కొణిజేటి రోశయ్య : త‌ల‌సాని

హైద‌రాబాద్, జులై 4 (ఆంధ్ర‌ప్ర‌భ ) : పదవులకే వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీమంత్రి రోశయ్య 92వ జయంతి సందర్భంగా అమీర్ పేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా హాస్పిటల్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం రోశయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మాట్లాడుతూ… శాసనమండలి సభ్యుడిగా, ఎమ్మెల్యే గా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన ఆయన విశేషమైన సేవలు అందించారని గుర్తు చేశారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కిందన్నారు. ఎవరైనా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తారని, కానీ రోశయ్యను వెతుక్కుంటూ పదవులు వచ్చాయని పేర్కొన్నారు. పదవులు అంకితభావంతో ఆయన చేసిన పనికి, కృషికి దక్కిన గౌరవాలుగా చెప్పారు. సనత్ నగర్ (Sanat Nagar) నియోజకవర్గ ఓటరుగా అమీర్ పేటలోనే నివాసం ఉండటం వలన తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అనేక సందర్భాల్లో తనను నిత్యం ప్రజల మధ్య ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నావని ప్రశంసించే వారని చెప్పారు. తెలుగుదనం ఉట్టి పడేలా వస్త్ర ధారణతో ఎంతో హుందాగా కనిపించే వారని తెలిపారు.

రాజకీయాల్లో అనేక మందికి రోశయ్య స్ఫూర్తి అని అన్నారు. నేచర్ క్యూర్ హాస్పిటల్ (Nature Cure Hospital) ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను సందర్శించగా సరైన సౌకర్యాలు, వసతులు లేక ఇతర రాష్ట్రాలకు ప్రకృతి వైద్యం కోసం వెళుతున్నారని తెలుసుకున్నానని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయించి ఎంతో గొప్పగా అభివృద్ధి చేసి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా అవసరమైన సౌకర్యాలు, హాస్పిటల్ అభివృద్ధి విషయంలో తన సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, హాస్పిటల్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు, ప్రిన్సిపాల్ మల్లిఖార్జున్, అమీర్ పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, గుడిగే శ్రీనివాస్ యాదవ్, ఆకుల రాజు, శివ, ఉత్తమ్ కుమార్, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply