TDP | తెలుగు తమ్ముళ్ల గలాట..

TDP | తెలుగు తమ్ముళ్ల గలాట..
- రసాభాసగా కొండపల్లి పట్టణ టీడీపీ సమావేశం
- పార్టీ అధ్యక్షుడి పదవి కోసమే రాద్ధాంతం
- చివరికి ఎమ్మెల్యే వసంత నిర్ణయమే ఫైనల్ అంటూ ఏకాభిప్రాయం
ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): కొండపల్లి పట్టణ టీడీపీ సమావేశం తెలుగు తమ్ముళ్ల మధ్య గలాటాకు దారితీసింది. దుర్భాషలు, తోపులాటలు, ఇద్దరు ఎస్సీ తమ్ముళ్లు చెయ్యి చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల ముందే బాహాబాహీకి దిగడంతో అందరూ నివ్వెరపోయారు.
కొండపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు హాజరయ్యారు.
వారు మాట్లాడుతుండగా గలాట మొదలైంది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు నోరు జారడంతో ఈ రగడ మొదలైందని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. నాయకులు వారిస్తున్నా…. వినకుండా తమ్ముళ్లు దుర్భాషలాడుకున్నారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలోనే ఎస్సీ సామాజిక వర్గం తమ్ముళ్లు ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకున్నట్లు చెబుతున్నారు.
చాలా కాలం నుంచి పార్టీ పట్టణ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్ లో ఉంది. ఈ పదవి కోసం పలువురు పోటీపడ్డారు. చివరికి ఈ పదవిని కాపులకు కేటాయించేందుకు పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే తమ్ముళ్లు అధ్యక్షుడి పదవి కోసం కుమ్ములాడుకున్నారు.
సీనియర్ నాయకులు ఉన్నారన్న గౌరవం లేకుండా దుర్భాషలాడటం విస్మయానికి గురిచేసింది. పట్టణ అధ్యక్షుడి పదవి దక్కదనే అక్కసుతోనే ఈ గలాట సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్వార్థం కోసం పార్టీ పరువును బజారుకీడ్చారని పలువురు తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి సీనియర్ నాయకుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నిర్ణయమే ఫైనల్ అని ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరగా తమ్ముళ్లంతా ఏకీభవించారు. దీంతో సమావేశం ముగిసింది.
