- కలెక్టర్ కు మంత్రి సుభాష్ ఆదేశాలు..
ఆంధ్రప్రభ, అమలాపురం : మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు సూచించారు. తుఫాను సహాయక చర్యల్లో భాగంగా మంత్రి సుభాష్ కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రిగా అధికారులతో మంగళవారం ఉదయం సమీక్షించారు. ఆ తరువాత కోనసీమ జిల్లాలో పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. వాయుగుండం నేటి రాత్రికి తీవ్ర తుఫానుగా మారనుందని, ఆ సమయంలో ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పునరావాస శిబిరాల్లో ఉన్న బాధితులకు నాణ్యమైన భోజనం, మంచినీరు, పాలు, అవసరమైన వారికి మందులు అందించాలన్నారు.
ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. తుఫాను తీరం దాటిపోయే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మంత్రి సుభాష్ కు వివరించారు.
అన్ని శాఖల అధికారులను సమన్వయ పరిచి సహాయక చర్యలు చేస్తున్నామన్నారు. కాట్రేనికోన, ఐ పోలవరం, సఖినేటిపల్లి, మల్కిపురం, ఉప్పలగుప్తం, కొత్తపేట మండలాల్లో సుమారు 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించమన్నారు.
తీర ప్రాంతాల్లో మెరైన్ పోలీసులతో పాటు సుమారు 150 గ్రామ సచివాలయంలో ఉన్న మహిళా పోలీసులతో గస్తీ నిర్వహించమన్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితులను అంచనా వేస్తు ప్రజలను అప్రమత్తo చేస్తున్నామని మంత్రి సుభాష్ కు కలెక్టర్ మహేష్ కుమార్ వివరించారు.

