Kidnap Case|వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ – జైలుకు తరలింపు
విజయవాడ: గన్నవరం వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు. అనంతరం ముగ్గురికీ 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు.
”వల్లభనేని వంశీ నొటోరియస్ క్రిమినల్. ఆయనకు చాలా నేర చరిత్ర ఉంది. చట్టం, న్యాయం అంటే లెక్కే లేదు. ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి”.. అని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
”గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు వంశీ తదిరులపై కేసు కథ అడ్డం తిరిగింది! ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితో వేసిన ఎత్తుగడ వికటించింది. మరో తీవ్రమైన కేసులో ఇరుక్కునేలా చేసింది. అరెస్టుదాకా వెళ్లింది. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును నీరు గార్చేందుకు మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద వైసీపీ నేత వల్లభనేని వంశీ పన్నిన పథకం తిరిగి ఆయన మెడకే చిక్కుకుంది.
కిడ్నాప్, బెదిరింపులు, ఎస్సీ, ఎస్టీ కేసులో వంశీని గురువారం ఉదయం విజయవాడ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు వాపస్ తీసుకునేలా తన సోదరుడు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి, భయపెట్టారని… కిడ్నాప్ కూడా చేశారని కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన బీసీ, మైనారిటీ, దళిత నాయకులు రమాదేవి, సురేశ్ బాబు, ఫణికుమార్, షేక్ జానీ ఇదే అంశంపై చేసిన ఫిర్యాదుపై ఇంకో కేసు పెట్టారు. ఈ రెండు కేసుల్లో పోలీసులు వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన ప్రధాన అనుచరులు కొమ్మా కోట్లు, రామకృష్ణ, నీరజ్ తదితరులను నిందితులుగా చేర్చారు.
ఇలా అరెస్టు…
బెదిరింపులు, కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టు కోసం అదనపు డీసీపీ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విజయవాడ నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. వీరు గురువారం ఉదయం 6.30 గంటలకు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. గచ్చిబౌలి మైహోం భుజాలో నివసిస్తున్న వల్లభనేని వంశీని అరెస్టు చేయాల్సి ఉందని, తమకు ఎస్కార్ట్ ఇవ్వాలని కోరారు. కేసు వివరాలను వారికి తెలిపారు. దీంతో… రాయదుర్గం ఠాణా నుంచి ఒక ఎస్‌ఐతోపాటు మరో ఐదుగురు పోలీసులు విజయవాడ పోలీసులకు తోడుగా వచ్చారు.
నేరుగా… మైహోమ్ భూజా డి బ్లాక్‌లో 11వ అంతస్తులో ఉంటున్న వంశీ ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. ”సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో మీపై పటమట పోలీసు స్టేషన్‌లో భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 140 (1), 308, 351(3), రెడ్‌విత్3(5)తోపాటు సెక్షన్ 3(2) ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 86/2025 కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం” అంటూ వంశీకి నోటీసు ఇచ్చారు. దాన్ని చదివిన తర్వాత పోలీసులతో వంశీ కొద్దిసేపు వాదనకు దిగారు.
ఆ తర్వాత ఎక్కువ హడావుడి చేయకుండానే పోలీసుల వెంట వచ్చేందుకు అంగీకరించారు. గురువారం ఉదయం 7 గంటలకల్లా వంశీ అరెస్టు ప్రక్రియ ముగిసింది. పటమట పోలీసులు ఉదయం 7.15 గంటలకు వంశీతోపాటు రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. మధ్యాహ్నం 12.40 గంటలకు భవానీపురం పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ వంశీని మరో వాహనంలోకి మార్చారు. ఆయనను పటమట పోలీ్‌సస్టేషన్‌కు తరలిస్తారని కొంతసేపు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తీసుకెళ్తారని మరికొంతసేపు ప్రచారం జరిగింది. అయితే.. ఎవరూ ఊహించనట్టుగా వంశీని మధ్యాహ్నం 1.10 గంటలకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
తెలియదు… తెలియదు…
కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో వంశీని నలుగురు అధికారులు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. ”సత్యవర్ధన్ జోలికి ఎందుకు వెళ్లారు? అతడిని ఎలా ట్రాప్ చేశారు?”… అంటూ పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ ‘తెలియదు… తెలియదు’ అని ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
అనంతరం రాత్రి 9.15 గంటలకు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం రాత్రి 10.15 గంటల సమయంలో ఆయనను 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయాధికారి రామ్మోహన్ ముందు హాజరు పరిచారు. ఇదే కేసులో అరెస్టు చేసిన ఏ7, ఏ8 ఏలినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిలను కూడా కోర్టుకు తీసుకొచ్చారు. మరో నిందితుడు, వంశీ వ్యక్తిగత సహాయకుడు వీర్రాజు కోర్టుకు వచ్చి స్వయంగా లొంగిపోయారు.
రిమాండ్ రిపోర్ట్
”వల్లభనేని వంశీ నొటోరియస్ క్రిమినల్. ఆయనకు చాలా నేర చరిత్ర ఉంది. చట్టం, న్యాయం అంటే లెక్కే లేదు. ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి”.. అని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ”గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు వంశీ తదిరులపై కేసు నమోదైంది. ఫిర్యాదు వాపస్ తీసుకోవాల్సిందిగా అప్పటి నుంచే ఆయనపై ఒత్తిళ్లు వస్తున్నాయని సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ స్పష్టం చేశారు. కేసు వాపసు తీసుకుంటే డబ్బులు ఇస్తామని… ఒప్పుకోకుంటే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ‘పెద్దవాళ్లతో ఎందుకు పెట్టుకుంటారు’ అని వజ్ర కుమార్ అనే వ్యక్తి చాలాసార్లు పరోక్షంగా హెచ్చరించారని… కొమ్మా కోటి, రామకృష్ణ, వీర్రాజు తదితరులు తన సోదరుడిని, తల్లిదండ్రులనూ బెదిరించారని కిరణ్ తెలిపారు.
ఈనెల 10వ తేదీన తన సోదరుడిని బలవంతంగా కారులో తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి… మొత్తం నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టాం. 13వ తేదీన ఏ1 వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేశాం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఫిర్యాదుకు సంబంధించి పొట్టి రాము (ఏ9)ను కలవాల్సిందిగా వల్లభనేని వంశీ తనపై ఒత్తిడి తెచ్చారని సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారు.
”మాజీ ఎమ్మెల్యేగా, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా వంశీ ఏమైనా చేయగలరు. ఆయన ఆదేశాల మేరకు పొట్టి రాము నన్ను హనుమాన్ జంక్షన్‌కు తీసుకెళ్లారు. కేసు వాపసు తీసుకుంటున్నట్లు రాసిన వాంగ్మూలంపై బెదిరించి సంతకం చేయించారు. ఆ తర్వాత… ఏపీ 40 బీజీ 5005 క్రెటా కారులో నన్ను బలవంతంగా కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ వాంగ్మూలం ఇప్పించారు” అని సత్యవర్ధన్ తెలిపారు.
10వ తేదీ అర్ధరాత్రి సత్యవర్ధన్‌ను హైదరాబాద్‌లోని మైహోం భుజాలో ఉన్న వల్లభనేని వంశీ వద్దకు తీసుకెళ్లారు. కేసు వాపసు తీసుకుంటూ మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని మళ్లీ బెదిరించారు. తీవ్రంగా హింసించారు. తేడా వస్తే కుటుంబ సభ్యులనూ చంపేస్తామన్నారు. మరుసటి రోజున… వంశీ ఆదేశాల మేరకు నలుగురు నిందితులు సత్యవర్ధన్‌ను కారులో విశాఖ పట్నం తీసుకెళ్లారు.
అక్కడ హోటల్ చందనలో బస చేశారు. 12వ తేదీన ఏ11కు చెందిన గెస్ట్‌హౌ్‌సకు మకాం మార్చారు. సత్యవర్ధన్ విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లాం. ఆరిలోవ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించి… దేవ దుర్గ శివ రామకృష్ణ, నిమ్మల లక్ష్మీపతి అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని… సత్యవర్ధన్‌ను రక్షించాం. ఆయనను విజయవాడకు తీసుకు వచ్చాం” అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వంశీతోపాటు మిగిలిన ఇద్దరు నిందితులను 14 రోజులు రిమాండ్‌కు పంపించాలని న్యాయమూర్తిని కోరారు .వాదనలు అంగీకరించి ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు. ఆ వెంటనే వారిని జైలుకు తరలించారు