Khammam | మిర్చి మార్కెట్‌లో రైతుల ధర్నా – బోర్డు ఏర్పాటునకు డిమాండ్
మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తేనే రైతులకు మేలు
నాఫెడ్ ద్వారా క్వింటా ₹25 వేలకు కొనుగోలు చేయాలి
మిర్చి ధర తగ్గింపునకు పాలకులదే బాధ్యత
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమంతరావు
ఖమ్మం, ఆంధ్రప్రభ బ్యూరో : పడిపోతున్న మిర్చి ధరలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు అన్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది సగానికి ధర పడిపోయిందని, పెట్టుబడులు గత ఏడాదికంటే రెంటింపయ్యాయని ఆయన తెలిపారు. మంగళవారం ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన చేశారు. సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో రైతులు పలు నినాదాలు చేశారు. మిర్చికొనుగోళ్లను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మార్కెట్ ముట్టడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావడంతో విధిలేక పోలీసులు మార్కెట్లోకి అనుమతించారు.
ధర పెంపునకు చర్యలు
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు ఆందోళనకారులకు సర్ధిచెప్పారు. త్వరలో రైతులు, వ్యాపారుల సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మిర్చి ధర పెంపునకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రైతు సంఘం నేతలతో కూడా ఆయన మాట్లాడారు. మిర్చి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
నాఫెడ్ ద్వారా ధర పెంచాలి
ఈ సందర్భంగా రైతుల నుద్దేశించి హేమంతరావు మాట్లాడుతూ నాఫెడ్ ద్వారా మిర్చిని క్వింటా ఒక్కింటికి రూ.25 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిర్చి ధర తగ్గింపుకు సంబంధించి పాలకులే బాధ్యత వహించాలన్నారు. పెట్టుబడి ఆధారంగా మద్దతు ధరను నిర్ణయించాలని కోరారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయరంగం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని, రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేటర్లకు అప్పగించాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి ధరలను స్థిరీకరించి సాగుకు గిట్టుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అధికారులు, వ్యాపారులు సిండికేట్ తో రైతులకు నష్టం
వ్యాపారులు, అధికారులు సిండికేట్‌గా మారుతున్నారని, దీనివల్ల ధర పెరగడం లేదని, రైతులు నష్టపోతున్నారని హేమంతరావు అన్నారు. మిర్చి ధర పెంచకపోతే మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో సీపీఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి డండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలాన, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, జిల్లా కార్యవర్గసభ్యులు శింగునర్సింహారావు, పోటు కళావతి, మిడికంటి చిన్న వెంకటరెడ్డి, రావి శివరామకృష్ణ, జాగర్లమూడి రంజిత్, ఏపూరి రవీంద్రబాబు, మందడపు రాణి రైతు సంఘాల నాయకులు పుచ్చకాయల సుధాకర్, బానోత్ రామ్కోటి, నూనెశశిధర్, బాగం ప్రసాద్, కూచిపుడి రవి, తుల్లూరి ప్రసాద్, ఇటికాల రామకృష్ణ, యడ్లపల్లి శంకరయ్య, పొద్దుటూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.