ఘనంగా కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి , ఆంధ్రప్రభ ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలను పట్టణ అధ్యక్షులు జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ జ్యోతుల మంజుల వేంకటేశ్వర్లు, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక సంవత్సరం పాటు ఉచిత డిష్ కనెక్షన్ అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను కొనియాడారు. సబండ వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించారని, తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి పథంలో నడిపారని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిందన్నారు. అలాగే రైతుల సంక్షేమం కోసం అమలు చేసిన రైతుబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా అండగా నిలిచారని తెలిపారు. ఇక హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ నాయకత్వం కీలకమని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply