KCR | తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం..

పాలమూరు నీళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును అస్సలు ఉపేక్షించే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెగేసి చెప్పారు. తానేదో తొందరపడి మాట్లాడుతున్నానని గానీ, లేక అక్కసుతో విమర్శలు చేస్తున్నానని గానీ అనుకోవద్దని, రాష్ట్రానికి వస్తున్న ముప్పును చూసి తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
అనేక సమస్యల మీద బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం కొట్లాడుతూనే ఉందని, కానీ ఇప్పుడు ఏకంగా రాష్ట్రానికే పెనుముప్పు వచ్చే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అటు గోదావరి మీద చంద్రబాబు నాయుడు నీళ్లను దోపిడీ చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని, ఇటు కృష్ణా నదిలో పాలమూరు ఎత్తిపోతల మీద ఇంత ఘోరం జరుగుతున్నా కేంద్రం చప్పుడు చేయడం లేదని మండిపడ్డారు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, రాష్ట్రంలో ఏం జరుగుతుందని కేసీఆర్ నిలదీశారు.
ఇంత దుర్మార్గం కళ్లముందే జరుగుతుంటే ఇక మౌనంగా ఉండటం సాధ్యం కాదని, అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగాలని డిసైడ్ అయినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇన్ని రోజులు ఒక తీరుగా ఉన్నాం.. కానీ ఇక తప్పేటట్లు లేదు, తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం, ఎవరికీ భయపడం అని హెచ్చరించారు.
ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు పెట్టాల్సిన దుస్థితి..
తెలంగాణ ప్రయోజనాల కోసం మరో ఉద్యమానికి సిద్ధమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా ఎదుర్కొన్న వివక్షను గుర్తు చేస్తూ, కృష్ణా నది 300 కిలోమీటర్ల మేర జిల్లాలో ప్రవహిస్తున్నప్పటికీ, గతంలో పాలకులు చేసిన ద్రోహం వల్ల ఈ ప్రాంతం ఎడారిగా మారిందని, ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు పెట్టాల్సిన దుస్థితి ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులైన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తిలను పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని, అలాగే ఆర్డీఎస్ కెనాల్ మోసాన్ని అరికట్టేందుకు తుమ్మిళ్ల లిఫ్ట్‌ను నిర్మించి ఆయకట్టును పారించామని కేసీఆర్ వివరించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదని, అది పాలమూరు ఆత్మగౌరవమని కేసీఆర్ అన్నారు. ఈ పథకానికి 173 టీఎంసీల నీటిని తరలించాలన్నదే బీఆర్‌ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించినందుకు బదులుగా తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్ ద్వారా రావాల్సిన మరో 45 టీఎంసీలు కలిపి మొత్తం 90.81 టీఎంసీలకు నికరంగా ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.
ఇప్పటికే రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశామని, ఆంధ్రాతో వివాదాలు తలెత్తకముందే నీటిని తరలించేందుకు 145 మెగావాట్ల భారీ పంపులను కూడా అమర్చామని చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని, గోదావరిపై ఏపీ చేస్తున్న దోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
సమైక్యాంధ్రలో 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు తీరని ద్రోహం చేశాయని, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమవుతుంటే తాను మౌనంగా ఉండలేనని కేసీఆర్ హెచ్చరించారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
రాబోయే రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల నాయకులతో భేటీ అయ్యి, గ్రామగ్రామాన పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తామని, మళ్లీ కవులు, గాయకులను తట్టి లేపి ఉద్యమ సెగ పుట్టిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఈ జలదోపిడీని అరికట్టాలని, మీడియా కూడా దీనిపై గళమెత్తాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇంత అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండాలని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ద్రోహాన్ని ఎండగడతామని తెలిపారు. తెలంగాణ నదీ జలాలకు బీఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని, రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎవరితోనైనా కొట్లాడతామని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
