KAVITHA | మునీరాబాద్ లో పార్టీ ఆవిర్భావ వేడుక

KAVITHA | మునీరాబాద్ లో పార్టీ ఆవిర్భావ వేడుక
KAVITHA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకోనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు గురించి నెలకొన్న ఊహాగానాలకు తెరదీస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టత ఇచ్చారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కొత్త పార్టీ వివరాలను వెల్లడించారు.

ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీని అధికారికంగా స్థాపించనున్నట్లు కవిత ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో 35వేలమంది కార్యకర్తలతో పార్టీ ఆవిర్భావ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినా, ప్రధాన ఆశయాలు ఇంకా నెరవేరలేదని ఆమె అభిప్రాయపడ్డారు. అందరి కోసం పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఏర్పడిందని, అదే ఉద్దేశంతో కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి ద్వారా ఇప్పటివరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించామని, వాటిని మరింత విస్తృతంగా కొనసాగించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
