Kasturba Gandhi | ఉద్యోగ అవకాశాలు..

Kasturba Gandhi | ఉద్యోగ అవకాశాలు..
Kasturba Gandhi, తిరుపతి, ఆంధ్రప్రభ : జిల్లా పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి ప్రకటన విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన, అవుట్ సోర్సింగ్ విధానంలో చేపడుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఇవన్నీ కేవలం మహిళా అభ్యర్థులకే కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాలికల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేజీబీవీ పాఠశాలల్లో అవసరమైన సిబ్బందిని నియమించేందుకు ఈ ప్రకటన జారీ చేసినట్లు తెలిపారు.
టైప్ 3, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో మొత్తం 9 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీటిలో వృత్తి శిక్షణ ఉపాధ్యాయులు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు, అటెండర్, సహాయక వంటవాడు, పారిశుధ్య కార్మికుల పోస్టులు ఉన్నాయి. అలాగే టైప్–4 కేజీబీవీలలో మొత్తం 23 ఖాళీలు ఉండగా, వార్డెన్, పార్ట్ టైం ఉపాధ్యాయులు, చౌకిదార్, ప్రధాన వంటవాడు, సహాయక వంటవాడు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మహిళలే అయి ఉండాలని, కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలని అధికారులు తెలిపారు. గరిష్ఠ వయోపరిమితి సాధారణ వర్గాలకు 45 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 50 సంవత్సరాలు, దివ్యాంగులకు 52 సంవత్సరాలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
వార్డెన్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీ.ఎడ్ లేదా ఎం.ఏ (విద్య) అర్హతగా పేర్కొన్నారు. పార్ట్ టైం ఉపాధ్యాయుల పోస్టుకు బీ.ఎస్‌సి (గణితం)తో పాటు బీ.ఎడ్ లేదా ఎం.ఏ (విద్య) అవసరమని తెలిపారు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్‌తో పాటు కంప్యూటర్ కోర్సు లేదా కంప్యూటర్స్‌లో డిగ్రీ ఉండాలని స్పష్టం చేశారు. వృత్తి శిక్షణ ఉపాధ్యాయులకు పదవ తరగతితో పాటు వృత్తి శిక్షణ లేదా డిప్లొమా ఉండాలని పేర్కొన్నారు. వంటవాడు, సహాయక వంటవాడు, చౌకిదార్, అటెండర్ తదితర పోస్టులకు ప్రత్యేక విద్యార్హత అవసరం లేదని తెలిపారు.
అర్హత గల మహిళా అభ్యర్థులు జనవరి 3వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌కు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంపిక ప్రక్రియలో మండలాన్ని యూనిట్‌గా పరిగణించి ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. తుది మెరిట్ జాబితాను జనవరి 28వ తేదీన విడుదల చేస్తామని, ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విధుల్లో చేరవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి ఏపీకోస్ మార్గదర్శకాల ప్రకారం గౌరవ వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంటూ, అర్హత కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
