Kasipeta | అడ‌వుల్లో మ‌ళ్లీ పెద్ద‌పులి గాండ్రింపులు

మంచిర్యాల, ఆంధ్ర‌ప్ర‌భ : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో పెద్ద పులి (Tiger) మ‌ళ్లీ వ‌చ్చింది. గత ఫిబ్రవరిలో 20 రోజుల పాటు కాసిపేట అడ‌వుల్లో మకాం వేసి హ‌ల్‌చ‌ల్‌ చేసి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు పులి గాండ్రింపులతో అడ‌విలో అలజడి మొదలైంది. కాసిపేట మండలంలోని వెంకటాపూర్, మల్కెపల్లి బీట్ పరిధిలో వెంకటపూర్ (Venkatapur) గ్రామానికి చెందిన రైతు బుద్దె రాజలింగుకు చెందిన లేగ దూడను పెద్దపులి దాడి చేసి హతమార్చినట్లు బెల్లంపల్లి రేంజర్ సీహెచ్ పూర్ణ చందర్ (CH Poorna Chandar) తెలిపారు. తన లేగ దూడ పులి దాడిలో చనిపోయిందని రైతు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోని మల్కెపల్లి, వెంకటాపూర్ బిట్ల సరిహద్దుల్లో ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందన్నారు.

కుంట వ‌ద్ద పెద్ద‌పులి అడుగులు..
పెద్దపులి అడుగులు కుంట వద్ద వరకు గుర్తించామని అట‌వీశాఖ అధికారులు (Forest Department officials) తెలిపారు. తిర్యాణి, కాసిపేట మండలాల శివారులో పెద్దపులి సంచరిస్తుంది. వెంకటాపూర్, లక్ష్మీపూర్, ఎగ్గండి, పెద్దగూడ, సోనాపూర్ అటవీ శివారు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి మకాం వేసినట్లు అధికారులు గుర్తించారు. శివారు గ్రామాల రైతులు పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లకుండా, బయట మేపుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఎవరికైనను పెద్దపులి సమాచారం తెలిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, బాధిత రైతుకు నష్టపరిహారం కోసం ఉన్న‌త‌ అధికారులకు వివరాలు పంపించినట్లు తెలిపారు.

పెద్దపులి, చిరుత పులుల హ‌ల్‌చ‌ల్‌..
కాసిపేట మండలంలో అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత పులలు హ‌ల్‌చ‌ల్‌ చేస్తున్నాయి. గతంలో పెద్దపులి ఏకంగా 20 రోజులపాటు కాసిపేట మండలంలోనే గ్రామాల‌ సమీపంలోనే తిరుగుతూ హంగామా చేసింది. కంటి మీద కనుకు లేకుండా చేసింది. అడవి పందులపై దాడులు చేసింది. ఎవరికీ ఎటువంటి హానీ చేయకుండా వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ పెద్ద పులి తిర్యాణి, కాసిపేట మధ్య అటవీ ప్రాంతాల్లో గ్రామాల శివారు ప్రాంతాల్లో తిరుగుతుండడం, లేగ దూడపై దాడి చేసి చంపడంతో మళ్లీ ఆందోళన పరిస్థితులు మళ్లీ నెలకొన్నాయి. దీంతో పాటు ఇటీవల దేవాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుత పులుల సంచారం విపరీతంగా పెరిగాయి. మద్దిమాడ,గట్రామ్పల్లి గ్రామాల్లో ఆవుల మందపై దాడులు చేశాయి. నిత్యం చిరుత పులుల సంచారం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెద్దపులి రావడం లేగ దూడ ను చంపడంతో కాసిపేట మండలంలో ప్రజలు భయందోళన చెందుతున్నారు.

Leave a Reply