కరీంనగర్, ఆంధ్రప్రభ : అత్యంత ఉత్కంఠ రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కీలక దశకు చేరుకుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కోటా ఓటుకు చేరకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఫలితాన్ని తేల్చనున్నాయి. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరు బయటపడతారో ఎవరి కొంప మునుగుతుందోననే ఉత్కంఠ మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థులను తీవ్రంగా కలిచి వేస్తోంది. మూడవ స్థానంలో నిలిచిన ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లు ఫలితాన్ని తేల్చే పరిస్థితి వచ్చింది. పట్టబద్రులు 2,52,007 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 27,671 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2,24,336 ఓట్లు చెల్లడంతో అధికారులు 1,12,169 ఓట్లను కోటాగా ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి 75,674 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 70,564, బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 60,319 ఓట్లు సాధించారు.
కోటా ఓట్లు ఎవరూ సాధించకపోవడంతో అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించి రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. మొత్తం పట్టభద్రుల ఎన్నిక కోసం 56మంది పోటీలో ఉండగా 53 మందికి కలిపి కేవలం 17,244 ఓట్లు మాత్రమే రావడం వల్ల వారి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయినా ఫలితం వెలువడదు. దీంతో మూడో స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణకు పడ్డ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాన్ని తేల్చనున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో అధిక మొత్తం ప్రసన్న హరికృష్ణకు వేసినట్లు అధికారులు గుర్తించారు అయితే ఆయన మూడో స్థానం ఉండడం వల్ల ఆయన కూడా ఎలిమినేట్ అవుతారు. తుది ఫలితం ప్రసన్న హరిప్రసాద్ కు పడ్డ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలనుంది. ప్రసన్న హరికృష్ణకు పడ్డ రెండవ ప్రాధాన్యత ఓట్లు బీజేపీకి పడితే అంజిరెడ్డి, కాంగ్రెస్ కు పడితే నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలున్నాయి.
29 మంది ఎలిమినేషన్
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 29 మంది అభ్యర్ధులను ఎలిమినేట్ చేశారు.. ఈ లెక్కింపులో బిజెపికి 249 , బిఎస్పీకి 224, కాంగ్రెస్ కు 186 ఓట్లు వచ్చాయి.
మొత్తం అభ్యర్థులకు లభించిన ఓట్లు
బీజేపీ 75,923
కాంగ్రెస్ 70, 750
బీస్పీ. 60,343