KanchiKacharla | తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం..

KanchiKacharla | తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం…

  • దగ్ధమైన‌ పాత రికార్డులు…
  • కార్యాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ..
  • ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశం..
  • రంగంలోకి క్లూస్ టీం..

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వేకువజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రికార్డు రూములో భద్రపరిచిన పాత రికార్డులు ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. కార్యాలయంలోని రికార్డ్ రూమ్‌లో దట్టంగా పొగలు కమ్ముకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయం లోపలి నుంచి భారీగా పొగలు రావడం గమనించిన ఒకవ్యక్తి శుక్రవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిందన్న వార్త తెలియగానే జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, గ్రామీణ సిఐ డి.చవాన్ లు సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీర్థనులను, పరిస్థితిని సమీక్షించారు.

పలు రికార్డులు దగ్ధం…

Kanchi Kacharla

అగ్ని ప్రమాదంలో రికార్డ్ రూమ్‌లో భద్రపరిచిన పలు ప్రభుత్వ పాత రికార్డులు కాలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరే ఇతర కారణాలున్నాయా అనే విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. కొంతకాలంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ వాచ్ మెన్ మరికొందరు కార్యాలయం ప‌క్కన చలిమంట వేసుకున్నారు.

మంటల నుండి చెలరేగిన నిప్పురవ్వలు పడి రికార్డులు దగ్ధమయ్యాయా ? లేక షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందా ? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేయవలసి ఉంది. ఈ ఘటనపై పోలీస్, రెవెన్యూ, ఫైర్ శాఖ అధికారులు సమీక్ష చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందన్న వార్త వెలుగు చూడటంతో సమాచారం తెలుసుకునేందుకు గ్రామస్తులు కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ముఖ్యమైన రికార్డులకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు…జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ తహసీల్దార్ కార్యాలయంలో చెలరేగిన మంటల వల్ల రికార్డు రూమ్ లో భద్రపరిచిన పాత రికార్డులు మాత్రమే దగ్ధమయ్యాయి తప్ప, ముఖ్యమైన రికార్డులు అందులో ఏమీ లేవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే జెసి హుటాహుటిన కంచికచర్ల చేరుకొని ఫోటో ప్రమాద తీరుతన్నులను పరిశీలించారు.

ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ…. అగ్నిప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయ మెయిన్ రికార్డు రూమ్ కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని, మెయిన్ రికార్డ్ రూమ్ లో ఉన్న రికార్డులు సురక్షితంగా ఉన్నాయన్నారు. మంటలు వ్యాపించిన రికార్డు రూమ్ లో ఉన్నవన్నీ డిస్పోస్ చేయాల్సిన పాత రికార్డులేనన్నారు. సుమారు 10 నుండి 15 సంవత్సరాల క్రితం నాటి కుల దృవీకరణ, ఆదాయ దృవీకరణ, పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్ క్లీమ్స్, ఎలక్షన్ క్లేమ్స్ కు సంబంధించిన ఓసి కాపీలే కాలిపోయాయి తప్ప, ప్రధాన రికార్డులన్నీ భద్రంగానే ఉన్నాయన్నారు.

చలిమంట నిప్పురవ్వల వల్ల ప్రమాదం జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనే విషయం డీటెయిల్ గా ఎంక్వయిరీ చేస్తున్నామన్నారు. దీనిపై పోలీసులను ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా కోరామన్నారు. ఫైర్, విద్యుత్తు శాఖలవారు కూడా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరేమన్నారు. క్లోజ్ టీం, ఫోరెన్సిక్ టీమ్ లు సంఘటన స్థలాన్ని సందర్శించాయి. ఆర్డిఓ కే.బాలకృష్ణ కంచికచర్ల లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Leave a Reply