Kaleswaram | ఎల్ అండ్ డి ఖండ‌న .. కాంగ్రెస్, బిజెపిల‌కు చెంప‌పెట్టు : కెటిఆర్

హైద‌రాబాద్ – మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) ఇచ్చిన నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో ఎలాంటి తప్పు లేదని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని.. కాంగ్రెస్‌, బీజేపీలు చేస్తున్న రాజకీయాల్లోనే అని విమర్శించారు. ఎన్ని కుట్రలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుందన్నారు. అశాస్త్రీయ ఆరోపణలను ఎల్‌ అండ్‌ టీ ఖండించండం సంతోషమన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని, కేసీఆర్ దూరదృష్టి గల నాయకుడు అని కేటీఆర్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్విట్ లో పేర్కొన్నారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గం అని కేటీఆర్ మండిప‌డ్డారు.

క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించ‌కుండానే నివేదిక‌..

క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు.

రాజీ ప‌డ‌కుండా నిర్మాణం…

ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలి. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో.. దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలి. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్ – బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *