Kadiyam Kavya | గడ్డి మందు పర్యావరణం, ఆరోగ్యానికి ప్రమాదకరం

Kadiyam Kavya | గడ్డి మందు పర్యావరణం, ఆరోగ్యానికి ప్రమాదకరం

  • ఆత్మహత్యలకు ఆయుధంగా మారిన పారాక్వాట్
  • పారాక్వాట్‌తో రైతులు, ప్రజల ప్రాణాలకు ముప్పు
  • ప్రాణాంతక గడ్డి మందుపై చర్యలు తీసుకోవాలి
  • వైద్య వర్గాలు గడ్డి మందు నిషేధాన్నీ కోరుతున్నాయి
  • లోక్‌సభలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య డిమాండ్

వరంగల్ సిటీబ్యూరో, ఆంద్రప్రభ ; దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోగ్య, పర్యావరణ ప్రమాదాలకు కారణమవుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) అనే అత్యంత ప్రమాదకర హర్బిసైడ్‌పై తక్షణమే పూర్తి నిషేధం విధించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో డిమాండ్ చేశారు. శుక్రవారం పార్లమెంట్ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎంపీ కావ్య ఆందోళన వ్యక్తం చేశారు.
పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) వినియోగం వల్ల నేల, నీరు, ఇసుక తీవ్రంగా కాలుష్యం అవుతున్నాయని ఎత్తి చూపారు.

దీని ప్రభావం వ్యవసాయ వ్యవస్థలపై తీవ్రమవుతోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. ఇది కేవలం పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రాణాంతక ముప్పుగా మారిందని హెచ్చరించారు. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ రసాయనం గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలకు మరణాయుధంగా మారిందని ఎంపీ కావ్య పేర్కొన్నారు. పారాక్వాట్ సేవించిన సందర్భాల్లో దాదాపు 100 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, దీనికి ఇప్పటివరకు సమర్థవంతమైన యాంటిడోట్ లేకపోవడం పరిస్థితిని మరింత విషమం చేస్తోందని అన్నారు.

తెలంగాణలోని వరంగల్ తో సహా పలు జిల్లాల్లో ఇది ఆత్మహత్యలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రమాదకర సాధనంగా మారిందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, పర్యావరణం, సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) తయారీ, విక్రయం, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ సహా పలువురు వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు కూడా ఇదే అంశంపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ నిషేధం కోసం ఒత్తిడి తెస్తున్నారని ఎంపీ గుర్తుచేశారు. ప్రమాదకర రసాయనాలకు బదులుగా సురక్షిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ డా.కడియం కావ్య కోరారు.

Leave a Reply