ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా గండికోట ప్రాంతాన్ని కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ కేసుపై కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ తాజా వివరాలను మీడియాకు వెల్లడించారు.
వైష్ణవి (17) హత్యకు గురైనట్లు నిర్ధారణ అయ్యిందని, అయితే ఆమెపై లైంగిక దాడి జరగలేదని స్పష్టం చేశారు. వైష్ణవి ప్రియుడు లోకేష్ కి హత్యలో పాత్ర ఉందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా, దర్యాప్తులో అతనికి ఎలాంటి సంబంధం లేదని డీఐజీ తేల్చిచెప్పారు.
మృతదేహం దుస్తులు లేకుండా ఉండటంతో లైంగిక దాడి జరిగినట్టు మొదట అనుమానాలు వచ్చినా, వైద్య పరీక్షల్లో అలాంటి ఆధారాలు లేవని డీఐజీ స్పష్టం చేశారు. హత్య మాత్రమే జరిగిందని, నిందితుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
ఏం జరిగిందంటే?
వైష్ణవి ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తికి చెందిన ఇంటర్ విద్యార్థిని. ప్రొద్దుటూరులోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతూ ఉంది. జూలై 14వ తేదీ ఉదయం కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన వైష్ణవి తిరిగి ఇంటికి రాలేదు. కళాశాలకు హాజరు కాని ఆమె విషయం తెలిసిన లెక్చరర్లు తండ్రి కొండయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
వైష్ణవి చివరిసారిగా తన స్నేహితుడు లోకేష్‌తో కలిసి గండికోటకు వెళ్ళినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు అంతా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. చివరకు గండికోట ప్రాంతంలో వైష్ణవి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
లోకేష్ పై కుటుంబ సభ్యుల అనుమానాలు..
వైష్ణవి చివరిసారిగా లోకేష్ ద్విచక్ర వాహనంపై గండికోటకు వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అతనే హత్య చేశాడని కుటుంబం ఆరోపిస్తోంది. దీనితో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇప్పటివరకు దర్యాప్తులో అతనికి హత్యకు సంబంధం లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టంగా చెప్పారు.
ప్రభుత్వం సీరియస్..
వైష్ణవి హత్య కేసును ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.