ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి పెద్ద ఎత్తున ఇన్ ఫ్లో రావడంతో… జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి ప్రవేశించే వరద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) 1,14,000 క్యూసెక్కులుగా నమోదైంది. వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమై 23 గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం వైపు విడుదల చేశారు.
ఇదిలా ఉండగా, జూరాల స్పిల్‌వే ద్వారా ప్రస్తుతం 89,378 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా.. పవర్ హౌస్ ద్వారా 28,505 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
భీమా లిఫ్ట్-I ద్వారా 650 క్యూసెక్కులు, కొయిలసాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు, నెట్టంపాడు లిఫ్ట్ ద్వారా 750 క్యూసెక్కులు, ఎడమ కాల్వ (LMC) ద్వారా 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వ (RMC) ద్వారా 600 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కాల్వ ద్వారా 150 క్యూసెక్కులు, పారలల్ కెనాల్ 700 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-II ద్వారా 700 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇతర డిమాండ్లు మొత్తం కలిపి 1,21,994 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు నుంచి విడుదల అవుతోంది.
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 318.516 మీటర్లు (9.657 టీఎంసీలు సామర్థ్యం) కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.300 మీటర్ల (1,041.010 అడుగులు) వద్ద ఉంది. ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ 7.279 టీఎంసీలు ఉండగా, లైవ్ స్టోరేజ్ 3.572 టీఎంసీలుగా ఉంది.
వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పర్యవేక్షణను మరింత కఠినంగా నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.