Judgement | ముంబై ట్రైన్ల‌లో పేలుళ్లు .. ఆ 12 మంది నిర్దోషులంటూ తీర్పు

19 ఏళ్ల త‌ర్వాత దోషుల‌ను నిర్దోషులుగా తేల్చిన హైకోర్టు
ఈ 12 మందిలో అయిదుగురికి మ‌ర‌ణ‌శిక్ష విధించిన కింద కోర్టు
దోషులు హైకోర్టుకు అప్పిల్ చేసుకోవ‌డంతో నేడు వెలువ‌డిన అంతిమ తీర్పు
అంద‌ర్ని విడుద‌ల చేయాల‌ని ఆదేశం

ముంబ‌యి – భారతదేశాన్ని 2006లో షాక్‌కు గురిచేసిన ముంబయి లోకల్ ట్రైన్ బాంబు దాడుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 19 సంవత్సరాల తరువాత, ఈ కేసులో దోషులుగా ప్రకటించబడి శిక్షలు విధించబడిన 12 మందిని హైకోర్టు పూర్తిగా నిర్దోషులుగా విడుదల చేసింది. 2015లో ట్రయల్ కోర్టు ఈ కేసులో 12 మందిని దోషులుగా తేల్చి, వారిలో ఐదుగురికి మరణశిక్ష, మిగిలిన వారికి జీవితఖైదు విధించింది. అయితే తాజాగా బాంబే హైకోర్టు న్యాయమూర్తులు అనిల్ కిలోర్, శ్యామ్ చందక్‌ల ధర్మాసనం ఈ తీర్పును రద్దు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రాసిక్యూషన్ తమ ఆరోపణలను నిరూపించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ దాడులు ఈ నిందితుల వల్లే జరిగాయన్నది నమ్మశక్యం కాదు. అందువల్ల వారికి విధించిన శిక్షను రద్దు చేస్తున్నాం అని హైకోర్టు పేర్కొంది. నిందితులు ఇతర కేసుల్లో కూడా లేకపోతే వారిని జైలు నుండి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ పేలుడు ఘటన 2006 జూలై 11న చోటుచేసుకుంది. కేవలం 11 నిమిషాల్లో ముంబయి లోకల్ ట్రైన్‌ లలో ఏడు బాంబు పేలుళ్లు సంభవించాయి. చర్చ్‌గేట్ నుండి బయలుదేరిన ట్రైన్‌ లలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన ప్రెషర్ కుకర్లలో బాంబులు అమర్చడం ద్వారా ఈ దాడులు జరిగాయి. ఈ బాంబులు సాయంత్రం 6:24 నుంచి 6:35 మ‌ధ్య‌లో పేలాయి. పేలుళ్లు మటుంగా రోడ్, మహిమ్ జంక్షన్, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భయందర్, బొరివలి వద్ద ట్రైన్‌ లలో చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 800 మందికి పైగా గాయాలపాలయ్యారు.

Leave a Reply