Journalists | ఎమ్మెల్యే రేవూరి వ్యాఖ్యలపై రాస్తారోకో…

Journalists | ఎమ్మెల్యే రేవూరి వ్యాఖ్యలపై రాస్తారోకో…

  • ఎమ్మెల్యే కార్యక్రమాలు బహిస్కరణకు నిర్ణయం

Journalists | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్థానిక జర్నలిస్టుల(Journalists)పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పరకాల బస్టాండ్ వద్ద ఆక్రమణల తొలగింపును పరిశీలించేందుకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి ఇవాళ బస్టాండుకు వచ్చిన క్రమంలో స్థానిక జర్నలిస్టులు ట్రాఫిక్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా… దురుసు మాటలతో చిందులు వేశారు.

జర్నలిస్టులు ఐతే ఏంటి..? ఎవరికి వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని దురుసుగా వ్యవహరించారు. ప్రజల కోసం వకల్తా తీసుకుంటున్నామని చెప్పబోయే ప్రయత్నం చేయగా మళ్ళీ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులు కవరేజి నుంచి బయిటకు వచ్చారు. ఎమ్మెల్యే(MLA) వ్యాఖ్యలు అప్రజాస్వామికం.. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ అమరదామంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అమరధామం నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ ప్రాంతం(Bus Stand Area)లో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికమన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply