Journalists | సమస్యల పరిష్కారానికి వినతి..

Journalists | సమస్యల పరిష్కారానికి వినతి..
Journalists | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, అక్రిడేషన్ సమస్యలు మరియు పెండింగ్ అంశాలపై చిత్తూరు జిల్లా అక్రిడేషన్ కమిటీ సమావేశం మంగళవారం సాయంకాలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా లిఖితపూర్వక వినతిపత్రంగా సమర్పించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ను కోరారు.
వినతిపత్రంలో మొత్తం 11 ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ, పెండింగ్‌లో ఉన్న మీడియా అక్రిడేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని మొదటి డిమాండ్‌గా పేర్కొన్నారు. అర్హత ఉన్న పత్రికా విలేకరులకు అనవసర ఆలస్యం లేకుండా అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత ఉండాలని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ.15 వేల గౌరవ వేతనం పింఛన్ మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు.
Journalists | ఆర్థిక భద్రత కల్పించాలి…
దీర్ఘకాలంగా సేవలందించిన జర్నలిస్టులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌లో క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసి, వైద్య చికిత్స సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, ప్రభుత్వ ఆసుపత్రులు, అనుబంధ ఆసుపత్రుల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం మరో ముఖ్యమైన అంశంగా ప్రస్తావించారు.

అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే సందర్భంలో జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు గృహ స్థలాల కేటాయింపు అంశాన్ని కూడా వినతిపత్రంలో ప్రస్తావిస్తూ, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న విలేకరులకు నివాస భద్రత కల్పించాలని కోరారు. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పూర్తి వివరాలతో సమగ్ర డేటాబేస్ సిద్ధం చేసి అక్రిడేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని, జర్నలిస్టులపై దాడులు లేదా ఇబ్బందులు తలెత్తినప్పుడు తక్షణ స్పందనకు తగిన చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని కమిటీ సభ్యులు వినతిపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఫీల్డ్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అవసరమైన గుర్తింపు, పరిపాలనా సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని, వివిధ శాఖల అధికారులతో సమన్వయం మెరుగుపరచాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో సమాచార శాఖ అధికారులు, ముఖ్యంగా జిల్లా పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయం ఖాళీగా ఉన్న ఏపీఆర్ఓ, పిఓ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. కమిటీ సమర్పించిన 11 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైన వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జర్నలిస్టులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమానికి జిల్లా పరిపాలన ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సాటి గంగాధర్, ఏ బాలాజీ, లక్ష్మీపతి, జి హరిప్రసాద్, ఎంజీ గోపి, కే ఉమాశంకర్, పి రాజేంద్రనాయుడు, పి చంద్రప్రకాష్, బి జగదీశ్వరన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
