Journalist | లిఫ్ట్ చైన్ తెగి జర్నలిస్టులకు గాయాలు…

Journalist | లిఫ్ట్ చైన్ తెగి జర్నలిస్టులకు గాయాలు…
- జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలింపు
Journalist | భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్‌లో గురువారం జరిగిన ప్రమాదంలో పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, అలాగే నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ రోడ్డులోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులు ముగిసిన అనంతరం వెనుతిరిగే క్రమంలో కన్వెన్షన్ హాల్‌లోని లిఫ్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్ ప్రారంభమైన కొద్దిసేపటికే దానికి ఉన్న చైన్ తెగిపోవడంతో అందులో ఉన్న జర్నలిస్టులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ఘటనలో జర్నలిస్టులు ఎడ్ల సంతోష్, పావుశెట్టి శ్రీనివాస్, బండారి రాజు, తాళ్ళపల్లి వెంకట సమ్మయ్య, సామల శ్రీనివాస్ లకు గాయాలు కాగా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, స్థానికులు వెంటనే స్పందించి వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇదిలా ఉండగా తాత్కాలికంగా నిర్మించిన కట్టడాల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, జర్నలిస్టు లు డిమాండ్ చేస్తున్నారు.
CLICK HERE TO READ MORE : రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయొద్దంటూ నిరసన
