Journalist | జర్నలిస్టు కుటుంబానికి రూ.లక్ష చెక్కు…

Journalist | జర్నలిస్టు కుటుంబానికి రూ.లక్ష చెక్కు…
- నెలకు రూ.3 వేల పెన్షన్ మంజూరు
- తెలంగాణ మీడియా అకాడమీ చేయూత
Journalist | అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టు అమరుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ అండగా నిలుస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా వందలాది జర్నలిస్టు కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, టీయూడబ్ల్యూజే (హెచ్–143) చందు నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 17 మంది జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ మంజూరు చేస్తూ చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమం అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరగగా, ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యా మరియు ప్రజా వ్యవహారాల సలహాదారు కేశవరావులు హాజరయ్యారు. లింగాల మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు రఘుపతి రాథోడ్ గత ఏడాది మృతి చెందగా, ఆయన కుటుంబానికి తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా మంజూరైన రూ.లక్ష చెక్కును ఆయన భార్య అలివేలుకు అందజేశారు.
అలాగే, అలివేలుకు నెలకు రూ.3,000 చొప్పున ఐదేళ్లపాటు పెన్షన్ అందించనున్నట్లు చందు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా అండగా నిలిచిన తెలంగాణ మీడియా అకాడమీకి, సహకరించిన చందు నాయక్‌కు అలివేలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
