చిన్నారి చికిత్సకు అండగా నిలిచిన జాన్సన్ నాయక్

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం ధర్మాజీ పేట్ గ్రామానికి చెందిన కడారి శివకుమార్, శిరీష దంపతులు ప్రస్తుతం ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి రెండేళ్ల కుమారుడు కడారి బన్నీ కొంతకాలంగా తీవ్రమైన మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండటంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.

చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం సహాయం అందించాలని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్‌ను ఆశ్రయించారు.

ఎన్నికల అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ జాన్సన్ నాయక్ వెంటనే స్పందించారు. కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. నిపుణులైన వైద్యులతో సంప్రదించి బాలుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ప్రారంభించేందుకు సహకరించారు.

అలాగే, అవసరమైన వైద్య సదుపాయాల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. సమయానికి ఆపరేషన్ నిర్వహించడంతో చిన్నారి ఆరోగ్యం మెరుగుపడింది. తమ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడటానికి కృషి చేసిన జాన్సన్ నాయక్‌కు శివకుమార్, శిరీష దంపతులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “సమస్య చెప్పగానే స్పందించి మా బిడ్డకు ప్రాణం పోశారు. మా కుటుంబానికి అండగా నిలిచిన జాన్సన్ అన్న గారి సేవలను జీవితాంతం మర్చిపోలేం” అని భావోద్వేగంతో పేర్కొన్నారు.

Leave a Reply