సహాయక చర్యల్లో జేసీ, ఆర్‌డీవోలు బిజీబిజీ

ఆంధ్రప్రభ విజయవాడ : తుపాను సహాయక చర్యలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ ఆదేశాల మేరకు జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, ఆర్‌డీవోలు కె.చైతన్య, కె.మాధురి, కె.బాలకృష్ణ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. పునరావాస కేంద్రాలకు, తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.

జేసీ ఇల‌క్కియ‌ నగరం లో నీరు నిలిచిన హెచ్. బి. కాలనీ, స్వాతి థియేటర్ రోడ్డును, భవానిపురం, లేబర్ కాలని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. విజయవాడ ఆర్డీవో చైతన్యతో కలిసి నున్న గ్రామంలోని చెరువును, జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.

పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి స్వయంగా భోజనం వడ్డించారు. కే.తాడేపల్లి గ్రామంలోని పునరావాస కేంద్రంలో భోజనం, ఇతర ఏర్పాట్లు పరిశీలించారు. తిరువూరు ఆర్డీవో కే.మాధురి తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలతో కలిసి అల్పాహారం స్వీకరించారు.

చింతలపాడు గ్రామం వద్ద పొంగిపొర్లుతున్న గుర్రపు వాగును పరిశీలించి, రాకపోకలు సాగించరాదని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. చౌటుపల్లి గ్రామం వద్ద పొంగిపొర్లుతున్న వేగుళ్ళ వాగును, ఏ.కొండూరు మండలం లోని రేపూడివాగును పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏ.కొండూరు మండలం పాత కొండూరు గ్రామ ఎస్సీ కాలనీలో నీరు నిలిచిన ఇళ్లను పరిశీలించి, జెసిబి తో డ్రెయిన్ లోని పూడికను తొలగింప చేసి సమస్యను పరిష్కరించారు. రెడ్డిగూడెం మండలంలో పంట దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. ఏ.కొండూరు మండలం పాత కొండూరు గ్రామంలోని పెద్ద చెరువు అలుగును, కోడూరు గ్రామంలోని ఊర చెరువును, గొల్లమందల గ్రామంలోని ఊట వాగులను పరిశీలించారు.

విజయవాడ ఆర్డీవో కె. చైతన్య మాచవరం రెవెన్యూ కాలనీలో కొండ ప్రాంతాలను పరిశీలించారు. ఫ్రేజర్ పేటలో కూలిన చెట్లను, విద్యుత్ స్తంభాన్ని పరిశీలించి, తొలగింప చేశారు. విజయ రాకేష్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.

నందిగామ ఆర్డీవో కే. బాలకృష్ణ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తో కలసి డివిఆర్ కాలనీ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పాత బస్టాండ్ వద్ద డ్రైనేజీ అడ్డంకులు తొలగింపజేసారు. చెన్నాపురం రోడ్డులో పొంగిపొర్లుతున్న నల్ల వాగును పరిశీలించి, హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేసి, వాహనాల రాకపోకలు నిలిపివేశారు.

కంచికచర్లలో పొంగిపొర్లుతున్న ఏనుగు గడ్డ వాగు వద్ద నిరోధకాలు (స్టాపర్స్) ఏర్పాటు చేశారు. వీర్లుపాడు మండలం పెద్దవరం గ్రామం వద్ద అల్లూరు ఛానల్ ను పరిశీలించారు.

Leave a Reply