Jasprit Bumrah | హాన‌ర్స్ బోర్డులో బుమ్రా..

  • 15వ టెస్టు ఫైఫర్ తో కొత్త రికార్డు

లార్డ్స్ వేదికగా జరుగుతున్న అండర్సన్-తెండూల్కర్ ట్రోఫీ మూడో టెస్టులో టీమిండియా స్పీడ్ స్ట‌ర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో చరిత్ర సృష్టించాడు. ఈరోజు (శుక్రవారం) బుమ్రా తన టెస్టు కెరీర్‌లో 15వ ఫైఫ‌ర్ సాధించాడు. దీంతో బుమ్రా త‌న‌ పేరును లార్డ్స్‌లోని ప్రసిద్ధ హానర్స్ బోర్డ్ పై లిఖించుకున్నాడు.

బుమ్రా కెరీర్‌లో ఇది 15వ ఐదు వికెట్ల ఘనత కాగా, విదేశాల్లో 13వది కావ‌డం విశేషం. కపిల్ దేవ్ 66 మ్యాచ్‌ల్లో 12 సార్లు ఐదు వికెట్లు తీసిన రికార్డును బుమ్రా అధిగమించి కేవలం 35 టెస్ట్ మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

విదేశీ టెస్టుల్లో అత్యధిక ఫైఫర్లు (భారత ఆటగాళ్లు)
• జస్ప్రీత్ బుమ్రా – 35 మ్యాచ్‌ల్లో 13 ఫైఫర్లు
• కపిల్ దేవ్ – 66 మ్యాచ్‌ల్లో 12 ఫైఫర్లు
• అనిల్ కుంబ్లే – 69 మ్యాచ్‌ల్లో 10 ఫైఫర్లు
• ఇషాంత్ శర్మ – 62 మ్యాచ్‌ల్లో 9 ఫైఫర్లు
• ఆర్. అశ్విన్ – 40 మ్యాచ్‌ల్లో 8 ఫైఫర్లు

మూడో టెస్టు మొదటి రోజు బుమ్రా తన తొలి స్పెల్‌లో వికెట్ తీయలేకపోయాడు. కానీ బంతిని అద్భుతంగా స్వింగ్ చేయించి ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇక‌ చివరి సెషన్‌లో బుమ్రా తన జోరు చూపించి హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

రెండో రోజు ఉదయం రెండో న్యూ బాల్‌తో బుమ్రా మరింత ఘాటుగా దాడి చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను అద్భుతమైన బంతితో ఔట్ చేసి, తర్వాత సెంచరీ చేసిన జో రూట్‌ను వెనక్కి పంపాడు. క్రిస్ వోక్స్‌ను గోల్డెన్ డక్‌గా అవుట్ చేసి ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్‌ను బలహీనపరిచాడు.

ఇక‌, రెండవ సెషన్‌లో జోఫ్రా ఆర్చర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి తన ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేశాడు. ఈ ఘనతతో ప్రపంచంలోని అత్యుత్తమ పేసర్లలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

Leave a Reply