Janasenani | పార్టీలు కాదు ప్ర‌జ‌లే ముఖ్యం – 15 ఏండ్ల‌పాటు అధికారం మ‌న‌దే -పవన్ కల్యాణ్

మ‌న‌స్ప‌ర్థ‌లు, క‌ల‌హాల‌కు చోటురానివ్వొద్దు
ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు అస్స‌లు చాన్స్ ఇవ్వొద్దు
అసంతృఫ్తులు ఉన్నా క‌లిసి ప‌నిచేయాలి
చేతికున్న అన్ని వేళ్లు ఒకేలా ఉండ‌వు
అయినా బిగించిన‌ పిడికిలిలా కూట‌మి ఉండాలి
సీనియ‌ర్ నేత చంద్ర‌బాబు చాతుర్యం ఏపీకి అవ‌స‌రం
2029లో వైసీపీ ఎట్లా అధికారంలోకి వ‌స్తుందో చూస్తాం
జ‌న‌సేన‌, కూట‌మి లీడ‌ర్ల‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ ఉద్బోధ‌
ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌ల‌పై ఏపీ, తెలంగాణ‌లో పెద్ద ఎత్త‌న చ‌ర్చ‌

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : (central desk – Andhra prabha )

పార్టీలు కాదు.. ప్ర‌జ‌లే త‌న‌కు ముఖ్య‌మని, ఎవ‌రెన్ని అనుకున్నా ప్ర‌జా సంక్షేమం కోసం మ‌రో 15 ఏండ్ల‌పాటు ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగాల‌ని జ‌న‌సేన (janasena ) అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ (deputy cm pawan kalyan ) అన్నారు. ప్ర‌కాశం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌లో (ap, telangana ) హాట్ టాపిక్‌గా (hot topic ) మారాయి.. కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య స్పర్థలు, అసంతృప్తులు కొనసాగుతున్నాయని విపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పైకి కలిసి ఉన్నట్లుగా చెప్పుకుంటున్న కూటమి పార్టీలు.. కొన్నిచోట్ల లోలోన కత్తులు దూసుకుంటున్నాయని సెటైర్లు వేస్తున్నారు. జనసేన, బీజేపీ నేతలకు కూటమిలో పెద్దగా ప్రాధాన్యం లేదని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న వేళ.. గడపగడపకూ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వెళుతున్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. కానీ, జనసేన, బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనడం లేదు. దీనిపై ప్రత్యర్థి వైసీపీ విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. సరిగ్గా ఇలాంటి వేళ.. ప్రకాశం జిల్లా పర్యటనలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ప్రత్యర్థి నేతల కామెంట్లకు కౌంటర్లు వేశారు. ఇదే సమయంలో కూటమి పార్టీలకు కొన్ని సూచనలు చేశారు.

15 ఏండ్లు కూట‌మి ఉండాల్సిందే..

ఏపీలో కూటమి పాలన కనీసం 15 ఏళ్లపాటైనా సాగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. అప్పుడే ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సరిగా చేరతాయన్నారు. ఈ క్రమంలోనే కూటమి పార్టీలు కలిసి కట్టుగా సాగడం ఎంతో అవసరం అంటూ హితబోధ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు చిన్నచిన్న అసంతృప్తులు స‌హ‌జంగానే ఉంటాయ‌న్నారు. అందుకే ఏ పార్టీనీ తక్కువగా అంచనా వేయొద్దని పవన సూచించారు.

పిడికిలిలా కూటమి ముందుకు సాగాలి..

అన్ని వేళ్లూ ఒకేలా ఉండవని జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. అయినా సరే ఏ వేలి బలం ఆ వేలుకు ఉంటుందన్నారు. అందుకే పిడికిలిలా కూట‌మి ముందుకు సాగాలన్నారు. ఇక్కడ కూటమి అంటేనే ఓ పిడికిలి అంటూ మూడు పార్టీల కార్యకర్తలకు హితబోధ చేశారు. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చినా రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగడం తప్పనిసరి అన్నారు. ఇదే సమయంలో తనకు పాలనలో ఏ మాత్రం అనుభవం లేదన్నారు. కానీ, గట్టిగా పోరాడే ధైర్యం మాత్రం ఉందన్నారు. కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇంత ప్రణాళికా బద్దంగా నడిపించడం కష్టమని స్ప‌ష్టంచేశారు.

కొట్టుకోమని అధికారం ఇవ్వలేదు..

కష్టపడమని, సమస్యలు పరిష్కరించమని కూటమి పార్టీలకు ప్రజలు అధికారం ఇచ్చారని ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ అన్నారు. అంతేకాని కొట్టుకోమని కాదంటూ సుతిమెత్తగానే ఘాటైన హెచ్చరికలు చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తనకు జనసేన సంక్షేమం, కూటమి సంక్షేమం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని చెప్పారు. తద్వారా పరిస్థితులు ఎలా ఉన్నా.. కూటమి పార్టీలు కలిసి కట్టుగా సాగాల్సిందేనన్న సందేశం ఇచ్చారు.

2029లో ఎలా అధికారంలోకి వస్తారో చూస్తాం..

కేవలం కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులకు హితబోధ చేయడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రౌడీయిజానికి, గూండాయిజానికి భయపడితే రాజకీయం చేస్తామా? అంటూ ప్రశ్నించారు. మేం అధికారంలోకి వస్తే అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని.. అసలు 2029లో వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. కూటమి కలిసి కట్టుగా సాగాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు చేశార‌ని, ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తాను ఆ దిశగా ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటానన్న సంకేతాలను మరోసారి బలంగా వినిపించార‌ని పొలిటిక‌ల్ అన‌లిస్టులు, ప‌వ‌న్‌ అభిమానులు అంటున్నారు.

Leave a Reply